online shopping: బాక్స్ లో రాయి పెట్టి... మొబైల్ అంటూ దగా చేసిన కస్టమర్ కేర్ ఉద్యోగి

  • ఆన్ లైన్ షాపింగ్ సైట్లో మొబైల్ కొని, తర్వాత క్యాన్సిల్ చేసిన వ్యక్తి
  • అయినా ఓ వ్యక్తి రాయితో కూడిన పార్సిల్ తీసుకొచ్చి డెలివరీ
  • రూ.10,000 వసూలు... తెరిచి చూస్తే బండరాయి

ఈ కామర్స్ వెబ్ సైట్లలో షాపింగ్ చేసేవారు అప్రమత్తంగా ఉండాల్సిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బాక్స్ లో రాయి పెట్టి కస్టమర్ కు డెలివరీ చేసి డబ్బులు కాజేశాడు ఈ కామర్స్ కంపెనీ కస్టమర్ కేర్ ఉద్యోగి.

ఆ వివరాల్లోకి వెళితే, వడోదర పట్టణంలోని ఫతేపురకు చెందిన చౌదరి ఓ ఆన్ లైన్ షాపింగ్ వేదికపై మొబైల్ ఫోన్ కు ఆర్డర్ చేశాడు. ఏమైందో గానీ తర్వాత ఆ ఆర్డర్ ను క్యాన్సిల్ కూడా చేసేశాడు. అయినప్పటికీ ఆ తర్వాతి రోజు హర్మిత్ మీర్ చందాని అనే వ్యక్తి పార్సిల్ తో చౌదరి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. అయితే, తాను ఆర్డర్ క్యాన్సిల్ చేశానని చెప్పి పార్సిల్ తీసుకునేందుకు చౌదరి నిరాకరించాడు.

కానీ, మీర్ చందాని మాత్రం ఆర్డర్ ప్లేస్ అయిందని, కనుక పార్సిల్ తీసుకోవాల్సిందేనని పట్టుబట్టి, చేతిలో పార్సిల్ పెట్టి రూ.10,000తో అక్కడి నుంచి తుర్రుమన్నాడు. తర్వాత పార్సిల్ తెరిచి చూసిన చౌదరి నోటమాట రాలేదు. లోపల చిన్న రాయి కనిపించింది. మోసం జరిగిందని గుర్తించిన చౌదరి వడోదర పట్టణ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడైన మీర్ చందానిని అరెస్ట్ చేశారు.

ఇంతకీ మీర్ చందానీ సదరు ఈ కామర్స్ కంపెనీ కస్టమర్ కేర్ విభాగం ఉద్యోగి కావడం ఆశ్చర్యం కలిగించేదే. చౌదరి ఆర్డర్ గురించి తెలుసుకుని పథకం ప్రకారం అతడు మోసగించాడు. 

  • Loading...

More Telugu News