jayaprakash reddy: రాయలసీమ వాళ్లంతా నన్ను తమవాడేనని చెప్పుకున్నారు: నటుడు జయప్రకాశ్ రెడ్డి
- 'ప్రేమించుకుందాం రా'లో ఛాన్స్ వచ్చింది
- సీరియస్ గా కనిపించాలని జయంత్ అన్నారు
- యాస పర్ఫెక్ట్ గా వుండాలని సురేశ్ బాబు చెప్పారు
తెలుగు తెరపై రాయలసీమ మాండలికంలో డైలాగ్స్ ను అద్భుతంగా చెప్పగలిగిన నటుడిగా జయప్రకాశ్ రెడ్డికి మంచి పేరుంది. ఆ పేరు తెచ్చుకోవడానికి ఆయన ఎంతో కసరత్తు చేశారు. అందుకు సంబంధించిన విషయాలను తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
" 'ప్రేమించుకుందాం రా' సినిమాలో నేను చేసిన పాత్రకిగాను ముందుగా బాలీవుడ్ ఆర్టిస్టులను అనుకున్నారట. ఆ తరువాత ఆ పాత్రకి నన్ను ఖాయం చేసుకున్నారు. 'నీలో కామెడీ టచ్ కూడా కనిపిస్తోంది .. ఈ సినిమాలో మాత్రం ఎక్కడా నీ ఫేస్ లో పొరపాటున కూడా కామెడీ కనిపించకూడదు .. ఎప్పుడూ సీరియస్ గా వుండాలి' అని దర్శకుడు జయంత్ సి.పరాన్జీ అన్నారు.
సురేశ్ బాబు గారేమో .. రాయల సీమ యాస ఇంకా పర్ఫెక్ట్ గా వుండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో కొంత సమయం తీసుకుని .. రాయల సీమ ప్రాంతాల్లో తిరుగుతూ .. అక్కడి వాళ్లతో మాట్లాడుతూ .. వాటిని రికార్డు చేసేవాడిని. అలా పూర్తిగా రాయలసీమ యాసను వంటబట్టించుకున్నాను. ఈ పాత్ర కోసం నేను పడిన కష్టం ఫలించింది. ఈ సినిమా విడుదలైన తరువాత అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఆదరించారు. ముఖ్యంగా రాయలసీమ వాళ్లు నన్ను తమ వాడిగా చెప్పుకున్నారు" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.