PCB: భారత్‌తో మ్యాచ్ ఫిక్సింగ్‌కు రూ.1.3 కోట్లు ఆఫర్ చేశారు!: పాక్ వివాదాస్పద ఆటగాడు అక్మల్
- వరుసగా రెండు బంతులు వదిలేయమన్నారు
- దేశం కోసం మాత్రమే ఆడతానని తెగేసి చెప్పా
- ఇంకోసారి ఇలాంటి ప్రతిపాదన తేవొద్దని హెచ్చరించా
- పాక్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అక్మల్
వివాదాస్పద పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2015 ప్రపంచకప్ సందర్భంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని బుకీలు తనను సంప్రదించారని, వరుసగా రెండు బంతులు వదిలేస్తే 2 లక్షల డాలర్లు (1.36 కోట్లు) ఇస్తామని ఆఫర్ చేశారని పేర్కొన్నాడు. తాను దేశం కోసం మాత్రమే ఆడతానని, ఇంకోసారి తన వద్ద ఇటువంటి ప్రతిపాదన తీసుకురావద్దని వారిని హెచ్చరించానని చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ (107)తో కదం తొక్కాడు. కాగా, అక్మల్ ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. కీపింగ్‌లో కోహ్లీ క్యాచ్‌ను పట్టుకున్నాడు. సామా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
అక్మల్ ఫిక్సింగ్ వ్యాఖ్యలను పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా పరిగణించింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జూన్ 27న లాహోర్‌లో యాంటి కరెప్షన్ యూనిట్ ఎదుట హాజరు కావాలంటూ నోటీసు పంపింది.
పాక్ జట్టులో అక్మల్ తొలి నుంచి వివాదాస్పదుడే. గతేడాది పాక్ కోచ్ మిక్కీ అర్థర్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు మూడు మ్యాచ్‌ల నిషేధం విధించారు. అదే ఏడాది పేసర్ జునైద్ ఖాన్‌తో గొడవపడ్డాడు. 2015లో ఓ డ్యాన్స్ పార్టీకి వెళ్లినందుకు జట్టులో చోటు కోల్పోయాడు.