Saudi Arebia: సౌదీ అరేబియాపై మిసైళ్లు... గడగడలాడిన రియాద్ ప్రజలు!
- మిసైళ్ల దాడికి దిగిన హుతీ తీవ్రవాదులు
- వాటిని అడ్డుకున్న సౌదీ డిఫెన్స్ దళాలు
- భారీ పేలుళ్లతో ప్రజల్లో ఆందోళన
పొరుగున ఉన్న యమన్ నుంచి మిసైళ్లు దూసుకు వస్తుండటంతో సౌదీ అరేబియా నగరం రియాద్ ప్రజలు గడగడలాడిపోయారు. యమన్ లోని ప్రభుత్వ వ్యతిరేక దళాల అధీనంలో ఉన్న ప్రాంతం నుంచి మిసైళ్ల ప్రయోగం జరుగగా, సౌదీ ఎయిర్ డిఫెన్స్ సైన్యం వాటిని గాల్లోనే అడ్డగించింది. క్షిపణి విధ్వంసక క్షిపణులను సౌదీ ప్రయోగించిన వేళ, నగరమంతా పేలుళ్లు వినిపించాయి.
"హులీ రెబల్స్ వర్గం రెండు బాలిస్టిక్ మిసైళ్లను రియాద్ పై ప్రయోగించింది" అని ప్రభుత్వ రంగ అల్-ఎఖబారియా టెలివిజన్ వెల్లడించింది. ఈ పేలుళ్ల తరువాత ఏమైనా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందా? అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా, రియాద్ లో ఉన్న న్యూస్ ఏజన్సీ 'ఏఎఫ్పీ' జర్నలిస్టు, తాను కనీసం నాలుగు భారీ పేలుడు శబ్దాలను విన్నట్టు వెల్లడించారు.
కాగా, హుతీ తీవ్రవాదులకు ఇరాన్ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మిసైళ్లు తమ లక్ష్యాలను చేరుకోలేకపోయాయని, రియాద్ మిలిటరీ ప్రతినిధి తుర్కి అల్ మాలికి వెల్లడించారు. ఇక గాల్లో మిసైళ్లు వస్తుండటాన్ని, అవి పేలుతున్నప్పుడు పలువురు ఆ దృశ్యాలను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.