Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు శోకాన్ని కలిగించాయి: పవన్ కల్యాణ్
- ట్రాక్టర్లో బయలుదేరిన కార్మికులు మృతి చెందడం ఎంతో బాధాకరం
- కృష్ణా నదికి వెళ్లిన విద్యార్థుల జీవితాలు విషాదంగా ముగిశాయి
- మృతుల కుటుంబాలకు నా సానుభూతి
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రమాద సంఘటనలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరిజిల్లా లక్ష్మీపురంలో ట్రాక్టర్ మూసి కాల్వలోకి బోల్తా పడి పదిమంది వ్యవసాయ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కృష్ణానది సంగమంలో నలుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయి అసువులు బాయడం చెప్పలేనంతగా బాధించిందని అన్నారు.
పత్తి చేలో పని చేయడానికి ట్రాక్టర్లో బయలుదేరిన కార్మికులు అనంతలోకాలకు చేరిపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. లక్ష్మీపురంలో మూసి కాల్వ కట్టపై ప్రయాణిస్తున్న ట్రాక్టర్ కాల్వలోకి జారిపోయి పది మంది ప్రాణాలను బలితీసుకుందని, కొద్దిపాటి జాగ్రత్త తీసుకునివుంటే వారి ప్రాణాలు నిలిచేవని అన్నారు. మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
అదేవిధంగా, విహార యాత్రకు కృష్ణా నదికి వచ్చిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలు విషాదంగా ముగియడం బాధాకరమని, ఈ సంఘటన చూసి వారి తల్లిదండ్రులు ఎంతగానో రోదిస్తుంటారని, ఏమి చేసినా వారి బాధను మనం దూరం చేయలేమని అన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కృష్ణా నది సంగమం వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
వాచ్ టవర్ ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బందిని నియమించాలని, సదా అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని, మృతుల కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు.