Jarkhand: జార్ఖండ్ లో దారుణాతి దారుణం... అమ్మాయిల అక్రమ రవాణా వద్దని చెప్పేందుకు వెళ్లిన ఐదుగురు మహిళల గ్యాంగ్ రేప్!
- రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలో ఘటన
- పురుషులను కొట్టి మహిళలను అపహరించిన దుండగులు
- మూడు గంటల పాటు పైశాచికం
- అనుమానితులను ప్రశ్నిస్తున్న పోలీసులు
జార్ఖండ్ లో సభ్య సమాజం సిగ్గుపడేంత దారుణాతి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మానవ అక్రమ రవాణా వద్దంటూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు వెళ్లిన ఐదుగురు మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగింది. రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలోని కోచాంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
మొత్తం 11 మంది సభ్యుల బృందం ఓ ఎన్జీవో తరఫున పనిచేస్తూ, ఓ పాఠశాల వద్ద ప్రదర్శన ఇస్తుండగా, మోటార్ సైకిళ్లపై ఆయుధాలతో వచ్చిన దుండగులు ఎన్జీఓ తరఫున వచ్చిన పురుషులను కొట్టి, ఐదుగురు మహిళలను బలవంతంగా కార్లలోకి ఎక్కించుకునిపోయి, వారిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. మూడు గంటల పాటు వారి పైశాచికం కొనసాగింది. జరిగిన ఘటనను వీడియో తీసి, విషయం బయటకు చెబితే, వాటిని సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని హెచ్చరించి వారిని విడుదల చేశారు.
సంఘటనతో భయపడిన ఆ ఐదుగురూ విషయాన్ని అధికారులకు వెల్లడించలేదు. అయితే, వారి అపహరణను ప్రత్యక్షంగా చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చిందని స్థానిక పోలీసు అధికారి అశ్వని కుమార్ సిన్హా 'పీటీఐ' వార్తా సంస్థకు తెలిపారు. ఈ కేసులో బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని, తొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. నిందితులందరినీ చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు.