Allu Sirish: ఎయిర్ టెల్ నుంచి వోడాఫోన్ కు మారాను... చెత్త నెట్ వర్క్: ఫైర్ అయిన తెలుగు హీరో
- ఇటీవల ఎంఎన్పీ తీసుకున్న అల్లు శిరిష్
- ఎయిర్ టెల్ బ్యాడ్ అనుకుంటే వోడాఫోన్ వరస్ట్
- 4జీ కాదుగదా... అసలు సిగ్నలే రాదని ఫైర్
వోడాఫోన్ సంస్థపై టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ కు కోపం వచ్చింది. ఎంత కోపం అంటే, తన ట్విట్టర్ ఖాతాలో సంస్థను ఏకిపారేసేంత. ఇంతకీ ఏమైందని అనుకుంటున్నారా? ఎయిర్ టెల్ నెట్ వర్క్ ను వాడుతున్న అల్లు శిరీష్, ఇటీవల మొబైల్ నంబర్ పోర్టబిలిటీని వాడుకుంటూ వోడాఫోన్ కు మారి, తన పాత నంబర్ నే ఉపయోగిస్తున్నారు. ఇక వోడాఫోన్ కు సిగ్నల్స్ అసలు అందడం లేదని, తాను ఓ చెత్త నెట్ వర్క్ ను ఆశ్రయించానని గుర్తించిన శిరీష్, అదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
"దేని విలువైనా అది నీ దగ్గరున్నంత కాలం తెలియదు. ఈమధ్యే ఎయిర్ టెల్ నుంచి వోడాఫోన్ మారాను. నా పరిస్థితి బ్యాడ్ నుంచి వరస్ట్ అయింది. 4జీ గురించి మరచిపోండి. కనీసం 2జీ సిగ్నల్స్ కూడా అందడం లేదు. కాల్ డ్రాప్స్ సంగతి పక్కనబెట్టండి. కనీసం సిగ్నల్ కూడా అందని పరిస్థితి. చాలా చింతిస్తున్నాను. ఓ పాఠం నేర్చుకున్నాను" అని తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ పోస్టు పెట్టాడు. ఇక ఓ సెలబ్రిటీగా ఉన్న శిరీష్ పెట్టిన పోస్టుపై వోడాఫోన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.