Andhra Pradesh: 2017 మార్చి తర్వాత కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు.. నిరూపిస్తే గుండుకొట్టించుకుంటా: ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
- జీవీఎల్ కు కుటుంబరావు సవాల్
- ఏపీ అభివృద్ధి ఆగకూడదనే ప్రత్యేక ప్యాకేజ్ కు ఒప్పుకున్నాం
- రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కావాలి
ఆంధ్రప్రదేశ్ కు 2017 మార్చి తర్వాత ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని, ఇచ్చినట్టు నిరూపిస్తే తాను గుండు కొట్టించుకుంటానని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుకు ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ విసిరారు. ‘టీవీ9’ లో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో వీళ్లిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబరావు మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతోనే నాడు ప్రత్యేక ప్యాకేజ్ కు ఒప్పుకున్నామని, పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి డీపీఆర్-2 కూడా ఇంతవరకు ఆమోదించలేదని అన్నారు.
రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నామని అన్నారు. 2016 సెప్టెంబర్ లో ప్రకటించిన ఈఏపీకి మార్గదర్శకాలు జారీ చేయలేదని, 2015-20 వరకు ఆరు ప్రాజెక్ట్ లకు వడ్డీతో సహా ఖర్చులన్నింటినీ కేంద్రం భరిస్తుందా? అని ప్రశ్నిస్తూ కేంద్రానికి ఓ లేఖ రాసినా స్పందించలేదని, మే 30న రెసిడెంట్ కమిషనర్ కు మరో లేఖ రాశారని అన్నారు. ఈ ప్రాజెక్టుల విషయంలో వడ్డీ సహా అసలు మొత్తం కూడా చెల్లిస్తున్నామని చెప్పారు.