tamma reddy: ఇదే పరిస్థితి కొనసాగితే మన సినిమాల్లో తెలుగు అమ్మాయిలు లేకుండా పోతారు!: తమ్మారెడ్డి
- ప్రపంచంలో ఏం జరిగినా కారణం సినిమా వాళ్లే అంటున్నారు!
- చాలా బాధగా ఉంది
- ఈ విషయంలో మీడియా సహకరించాలి
అమెరికాలో టాలీవుడ్ మహిళానటులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై కిషన్ మోదుగమూడి అలియాస్ శ్రీరాజ్, అతని భార్య చంద్రలను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
‘ఈ మధ్య కాలంలో అమెరికాలో వ్యభిచారం చేయిస్తున్నారని ఓ కపుల్ ని అరెస్టు చేశారు. చార్జిషీట్ లో కూడా పింప్ (తార్చేవాడు) అనే రాశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లమని వాళ్లు (కిషన్, చంద్ర) చెప్పారట. ఇంతకాలం భారతదేశంలోనే అనుకున్నా.. ఇప్పుడు, ప్రపంచంలో ఏది జరిగినా కూడా దానికి తెలుగు సినిమావాళ్లే కారణమైపోతున్నారు!
కొంచెం బాధగా ఉంది. వాళ్లెవరో తెలియదు. ఎప్పుడో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారంటారు... ప్రోగ్రామ్స్ నిమిత్తం ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లిన వాళ్లు సినిమావాళ్లా? కాదా? అనే విషయం పూర్తిగా తెలియదు. సమస్యేమిటంటే.. ఏం జరిగినా సినిమా వాళ్లే అంటున్నారు. అతన్ని (కిషన్) పింప్ అని అనకుండా ప్రొడ్యూసర్, సినిమావాడని మీడియా వాళ్లు ఎందుకంటున్నారు? తప్పు పని చేసినవాడిని తప్పుడోడు అని అనకుండా, సినిమా ఇండస్ట్రీపై బురద జల్లడం ఎంతవరకు న్యాయం?
చాలా బాధగా ఉంది. సినిమా వాళ్లే ఎందుకు సాఫ్ట్ కార్నర్ అవుతున్నారు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుంటే ఇండస్ట్రీ ఎందుకు ఊరుకుంటోంది? సైలెంట్ గా ఉంటే మరింత ఎక్కువవుతుంది. దీన్ని ఆపడమెట్లా? దీనిని ఆపాలంటే మీడియా మిత్రులు సహకరించాలి. ఇంతకాలం సహకరించారు. మీడియా మిత్రులను అడిగేదేమిటంటే.. మంచి రాయండి, చెడూ రాయండి. కానీ, లేనివి ఉన్నట్లుగా రాయడం.. ఎవరో బురదజల్లుతుంటే.. సాక్ష్యాలు లేకుండా వాటిని ప్రసారం చేయొద్దు. ఇదే పరిస్థితి కొనసాగుతుంటే తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు ఉండకుండా పోయే అవకాశాలు వస్తాయి' అన్నారు తమ్మారెడ్డి.