manisharma: ఇప్పుడు హీరోలు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి: సంగీత దర్శకుడు మణిశర్మ
- ఒకప్పుడున్న పరిస్థితులు వేరు
- ఇప్పుడున్న పద్ధతులు వేరు
- తప్పయినా హీరోలు చెప్పిందే చేయాలి
తెలుగులో సంగీత దర్శకుడిగా మణిశర్మకి ప్రత్యేకమైన స్థానం వుంది. ఆయన సంగీతాన్ని అందించిన ఎన్నో పాటలు మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేశాయి. అలాంటి మణిశర్మ తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.
"నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు సంగీతం విషయంలో హీరోల ప్రమేయం అంతగా ఉండేది కాదు. చిరంజీవి .. బాలకృష్ణ సినిమాలకు నేను పనిచేశాను. సంగీత దర్శకుడిగా నేను ఒకసారి ఫిక్స్ అయ్యాక నా పని నేను చేసుకుంటూ వెళ్లేవాడిని .. వాళ్ల పనుల్లో వాళ్లు ఉండేవారు. హీరోలను హండ్రెడ్ డేస్ ఫంక్షన్ లోనో .. బర్త్ డే ఫంక్షన్ లోనో కలిసేవాళ్లం అంతే. కానీ ఇప్పుడు హీరోలకి కావలసిందే సంగీత దర్శకుడు చేయాల్సి వస్తోంది. వీడు చెబితే మనం వినేదేంటి అనే ఫీలింగ్ ఎక్కువ మందిలో కనిపిస్తోంది. వాళ్లు చెప్పేది 50 .. 60 శాతం తప్పయినా అలాగే చేయాల్సిన పరిస్థితి వుంది. ఏం చేస్తాం .. ఇది హీరో ఓరియెంటెడ్ ఇండస్ట్రీ" అని చెప్పుకొచ్చారు.