Guntur District: రైల్వే శాఖనే నిర్ఘాంతపరుస్తున్న దోపిడీ.. ఏకంగా సిగ్నల్‌నే మార్చిన దొంగలు!

  • భారీ దోపిడీకి దొంగల ప్లాన్
  • వైర్ కత్తిరించి సిగ్నల్ మార్చినట్టు అనుమానాలు
  • ప్రయాణికుల అప్రమత్తతతో దొంగల పరారీ

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం రైల్వే స్టేషన్ అవుటర్‌లో నర్సాపురం ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దోపిడీ మొత్తం రైల్వే శాఖనే నిర్ఘాంతపరుస్తోంది. రైలు ఆగేందుకు అక్కడ సిగ్నల్ ఇవ్వనప్పటికీ రెడ్ సిగ్నల్ పడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిగ్నల్‌లో లోపమే అందుకు కారణమని కొందరు భావిస్తుండగా, దొంగలు ఏకంగా సిగ్నల్‌ వైరును కత్తిరించి గ్రీన్ లైటుపడకుండా చేసినట్టు అనుమానిస్తున్నారు. అయితే, రైల్వే అధికారులు మాత్రం ఈ విషయంలో గుంభనంగా ఉన్నారు.

రెడ్ సిగ్నల్ పడడంతో సిరిపురం రైల్వే స్టేషన్ అవుటర్‌లో లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. రైలు ఆగిన వెంటనే లోపలికి ప్రవేశించిన దొంగలు ఎస్‌-5, ఎస్‌-8 బోగీలలోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. నిద్రపోతున్న భీమవరానికి చెందిన సాయి ప్రియ, సుబ్బలక్ష్మి ఒంటిపై ఉన్న 76 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారు. మెలకువ వచ్చిన వారు కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు.

దొంగలు పథకం ప్రకారమే రైలును ఆపి ఉంటారని, భారీ దోపిడీకి కుట్ర పన్ని ఉంటారని పోలీసులు చెబుతున్నారు. గుంటూరు-నడికుడి రూట్‌లో దోపిడీకి అనువైన ప్రదేశాలు ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మరోవైపు దోపిడీకి గురైన బాధితులు సిరిపురం రైల్వే స్టేషన్‌లో సమాచారమిచ్చి భీమవరంలో ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు అప్రమత్తం కాలేకపోయినట్టు తెలుస్తోంది.

Guntur District
railway
police
singnal
  • Loading...

More Telugu News