reham khan: ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముషారఫ్
- ఇలాంటి రాతలు రాయడానికి రెహమ్ ఖాన్ కు సిగ్గుండాలి
- మహిళలు ఇలాంటి రాతలు రాయడమేంటి?
- పీఎంఎల్ పార్టీ ఆమెను ఉపయోగించుకుంటోంది
పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆత్మకథ 'టెల్ ఆల్' నుంచి లీకైన కొన్ని వ్యాఖ్యలను గురించి ఆయన ఖలీజ్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మండిపడ్డారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ ఆమెను ఉపయోగించుకుంటోందని ఆయన అన్నారు. ఆమె పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలను తాను కూడా చదివానని... ఇలాంటి రాతలు రాయడానికి ఆమెకు సిగ్గు ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి రాతలు రాయడం ఏంటని ప్రశ్నించారు.
ముషారఫ్ వ్యాఖ్యలపై రెహమ్ ఖాన్ కూడా మండిపడ్డారు. మహిళలు ఏం మాట్లాడాలో కూడా ఆయనే చెబుతారా? అని ప్రశ్నించారు. 'మహిళలు ఏమీ మాట్లాడకూడదు... పురుషులు ఏం చేసినా పడుండాలి' అనే విధంగా ముషారఫ్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ తో తనకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.