Jagan: ఈ నాలుగేళ్లూ నిరుద్యోగులు చంద్రబాబుకు గుర్తుకు రాలేదు!: జగన్
- జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు
- నెలకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు
- నాలుగేళ్లకు 96,000 రూపాయలు బాకీ పడ్డారు
ఎన్నికల ముందు జాబు రావాలంటే బాబు రావాలని అన్నారని కానీ, జాబు రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆయన ర్యాలీలో మాట్లాడుతూ... ప్రతి ఇంటికి చంద్రబాబు మనుషులను పంపి, మీ పిల్లలు ఏం చదవకపోయినా ఫర్వాలేదు.. జాబ్ ఇస్తామని అన్నారని జగన్ అన్నారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేక ఉపాధి ఇస్తామన్నారని, ఒకవేళ కల్పించకపోతే నెలకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు.
నెలకు 2000 అంటే నాలుగేళ్లకు ఒక్కో యువకుడికి 96,000 రూపాయల చొప్పున బాకీ పడ్డారని చెప్పారు. నాలుగేళ్లు నిరుద్యోగులు చంద్రబాబుకు గుర్తుకు రాలేదని, ఎన్నికలు ఉన్నాయన్న సమయంలో చంద్రబాబుకి నిరుద్యోగులు గుర్తు కొస్తున్నారని చెప్పారు. అందుకే మభ్యపెట్టడానికి రూ.1000 భృతి ఇస్తామంటున్నారని చెప్పారు.
కాగా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు కూడా అరకొరగా ఇస్తున్నారని జగన్ చెప్పారు. అది కూడా చాలా మందికి అందడం లేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ఛార్జీలు ఎక్కువ అని అన్నారు. ఇంత దారుణంగా మోసం చేస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటారా? అని జగన్ ప్రశ్నించారు.