Mulla Fazal Ullah: పాక్ ఉగ్రనేతను మట్టుబెట్టిన అమెరికా!
- 2012లో మలాలాపై హత్యాయత్నం వెనుక సూత్రధారి ముల్లా ఫజల్ ఉల్లా
- డ్రోన్లను పంపి హతమార్చిన అమెరికా సైన్యం
- పాక్, ఆఫ్గన్ సరిహద్దుల్లో ఘటన
అమెరికా జరిపిన డ్రోన్ (మానవ రహిత విమానం) దాడిలో తెహ్రిక్-ఐ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) చీఫ్ ముల్లా ఫజల్ ఉల్లా హతమయ్యాడు. ఈ విషయాన్ని యూఎస్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఓ డొనెల్ వెల్లడించారు. ఈ నెల 13న తాము ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని కునార్ ప్రావిన్స్ ప్రాంతంలో జరిపిన కౌంటర్ టెర్రరిజమ్ దాడుల్లో ముల్లా ఫజల్ ఉల్లా మరణించాడని తెలిపారు. కాగా, ఈ విషయమై పెంటగాన్ అధికారులు మాత్రం ఏ విధమైన వ్యాఖ్యలూ చేయలేదు. తాము జరిపిన డ్రోన్ దాడులు విజయవంతం అయ్యాయని మాత్రమే పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి.
కాగా, అమెరికా, పాకిస్థాన్ దేశాల్లో జరిగిన పలు దాడులకు ఫజల్ ఉల్లా సూత్రధారని తెలుస్తోంది. డిసెంబర్ 2014లో పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై దాడి చేసి, వంద మందికి పైగా చిన్నారులు సహా 151 మందిని క్రూరంగా హత్య చేసిన కేసులోనూ ఫజల్ నిందితుడు. 2012లో మలాలా యూసఫ్ జాయ్ పై జరిపిన హత్యాయత్నం ఘటన వెనుక సూత్రధారి కూడా ఇతనే. ఇతని తలపై అమెరికా ప్రభుత్వం 5 మిలియన్ డాలర్ల నజరానాను ప్రకటించింది. టీటీపీ నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణా కేంద్రానికి ఫజల్ వస్తున్నాడన్న సమాచారంతో, అక్కడికి డ్రోన్ విమానాలను పంపించిన అమెరికా సైన్యం, అతన్ని మట్టుబెట్టిందని తెలుస్తోంది.