Jagan: చంద్రబాబు రెండు సినిమాలు చూపిస్తున్నారు: రాజమహేంద్రవరంలో జగన్

  • మొదటి సినిమా అమరావతి
  • రెండో సినిమా పోలవరం
  • అదిగో సింగపూర్‌.. ఇదిగో రాజధాని అంటారు
  • కాస్త కలెక్షన్లు ఎక్కువ రావడానికి పోలవరం వెళుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు సినిమాలు చూపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. అందులో ఒకటి రాజధాని అమరావతి కాగా, మరొకటి పోలవరం అని అన్నారు. ఈరోజు రాజమహేంద్రవరం, కోటిపల్లి శ్యామలా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... 'చందబ్రాబు నాయుడు మొదటి సినిమాను చూపిస్తూ... అదిగో సింగపూర్‌.. అదిగో జపాన్‌.. ఇదిగో రాజధాని అమరావతి అంటారు' అని ఎద్దేవా చేశారు.

అమరావతి అనే సినిమా ఒకటి ఇలా చూపెడుతోంటే, రెండో సినిమా పోలవరం ప్రాజెక్టును కూడా మోసాలతోనే చూపిస్తున్నారని జగన్‌ అన్నారు. కాస్త కలెక్షన్లు ఎక్కువ రావడానికి ప్రతి సోమవారం పోలవారం అంటూ అక్కడకు వెళుతున్నారని ఆరోపించారు. "పోలవరం సినిమా ఎలా ఉందంటే మొన్న పునాది గోడలను జాతికి అంకితం చేశారు. డయాఫ్రమ్ వాల్ అంటూ ఎన్నో అసత్యాలు చెప్పుకున్నారు. ఒక ఇల్లు కట్టడానికి ఆరుసార్లు శంకుస్థాపన చేసినట్లు ఉంది ఇది.

ఒక ఇంటికి పునాది తవ్వి ఆ ఇల్లు పూర్తి కాకముందే గృహప్రవేశం చేసినట్లు ఉంది. నాలుగేళ్లుగా చంద్రబాబు ఈ సినిమాలే చూపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఆయన కల అని అంటున్నారు. అప్పట్లోనూ చంద్రబాబు 9 ఏళ్లు అధికారంలో ఉన్నారు. అప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు కోసం ఏమీ చేయలేదు. నాటి 9 ఏళ్ల చంద్రబాబు హయాంలో టీడీపీ ఎమ్మెల్యే వడ్డి వీరభద్రరావు పోలవరం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు 3000 కిలోమీటర్లు సైకిల్ పై యాత్ర చేశారు. పోలవరం నిర్మించాలని ఆయన చంద్రబాబును అనేకసార్లు అడిగినా పట్టించుకోలేదు. ఆ తరువాత వైఎస్సార్‌ హయాంలో వేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు జరిగాయి. ఇప్పుడు కూడా చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నత్తనడకన ముందుకు వెళుతోంది. పోలవరంపై చంద్రబాబు చిత్తశుద్ధితో లేరు" అని జగన్‌ అన్నారు.        

  • Loading...

More Telugu News