lottery ticket: లాటరీలో రూ. కోటి తగిలిందని ఎగిరిగంతేశాడు.. తీరా ఆ టికెట్టు నకిలీదన్నారు!
- మహారాష్ట్ర, కల్యాణ్ వాసికి ఎదురైన వింత అనుభవం
- లాటరీలో రూ.1.11 బంపర్ ప్రైజ్
- కానీ, అది నకిలీ టికెట్ అనడంతో పోలీసులకు ఫిర్యాదు
పేదవాడు... కష్టాన్ని నమ్ముకున్నవాడు. లాటరీ తగిలితే ధనవంతుడు అవుదామనే ఆశతో టికెట్టు కొన్నాడు. అదృష్టం వరించింది. రూ.1.11 కోట్ల నగదు బహుమతి లాటరీలో గెలుచుకున్నాడు. కానీ, తీరా సంబరంలో ఉంటే ‘నువ్వు కొన్నది నకిలీ టికెట్. నీవు లాటరీ గెలవలేదు’ అని అన్నారు. మహారాష్ట్రలోని నలసోపరకు చెందిన సుహాస్ కదమ్ కు ఎదురైన అనుభవం ఇది.
ఇతడు బ్రెడ్ తయారీ కంపెనీలో పనిచేస్తూ, పార్ట్ టైమ్ కూరగాయల విక్రయంతో జీవనం సాగిస్తున్నాడు. మార్చి 16న కల్యాణ్ రైల్వే స్టేషన్ లో అతడు టికెట్కు కొన్నాడు. 20న తీసిన లాటరీలో ఈ టికెట్ కే రూ.1.11 కోట్ల బంపర్ ప్రైజ్ రాగా, అది నకిలీ టికెట్ అని రాష్ట్ర లాటరీ విభాగం అతడికి తెలియజేసింది. తన దగ్గరున్న టికెట్ పై బార్ కోడ్ ఉందని, అదే నిజమైన టికెట్టు అని అతడి వాదన.
గుర్తింపు పొందిన లాటరీ కేంద్రాల్లో నకిలీ టికెట్లు ఎలా విక్రయిస్తున్నారో దర్యాప్తు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి, థానే పోలీసు కమిషనర్, రాష్ట్ర లాటరీ విభాగానికి లేఖ రాశాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి స్కామ్ గుట్టు విప్పుతారని రాష్ట్ర లాటరీ విభాగం కమిషనర్ అమిత్ సైని తెలిపారు.