Nirmala seetharaman: వాట్సాప్ పేరు వింటేనే వణుకు పుడుతోంది.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

  • కుటుంబ వ్యవస్థకు క్రమంగా దూరమవుతున్నారు
  • ఏకాంతం చివరికి చెడు మార్గాలవైపు మళ్లిస్తుంది
  • చర్చా కార్యక్రమంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్

మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేరు వింటేనే తనకు భయమేస్తోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. హైదరాబాద్‌లో శనివారం సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. దేశంపై శతాబ్దాలుగా ఎన్నో దండయాత్రలు జరిగినా భారతీయత చెక్కు చెదరలేదన్నారు. దీనికి కారణం సాంస్కృతిక జాతీయ వాదమేనని పేర్కొన్నారు. దేశాన్ని ఇదే కలిపి ఉంచుతోందన్నారు.

మానవతా విలువలను భావితరాలకు అందించేది కుటుంబ వ్యవస్థేనని, మనిషి ప్రతీ అడుగులోనూ కుటుంబం అండగా నిలుస్తుందని అన్నారు. వ్యక్తి ఎదుగుదలకు, సమాజాభివృద్ధికి కుటుంబ వ్యవస్థ ఎంతో కీలకమైనదని, కాబట్టి ఎప్పుడూ దానికి దూరం కాకూడదని సూచించారు. దురదృష్టవశాత్తు ఇప్పుడది జరగడం లేదన్నారు. వాట్సాప్‌ను చూస్తే తనకు భయమేస్తోందని, ఎప్పుడూ దాంట్లోనే మునిగి తేలుతున్న యువత కుటుంబ వ్యవస్థకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల యువతకు సాంస్కృతిక విలువలు, భారతీయ సమాజం గురించి చెప్పే వారే లేకుండా పోయారని అన్నారు. ఫలితంగా ఈ ఏకాంతం నేరాల వైపు, చెడు పనుల వైపు దారి తీస్తోందన్నారు.

ఆరెస్సెస్ సంయుక్త కార్యదర్శి సురేశ్ జీ సోనీ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో పత్రికలు అద్భుతమైన పాత్ర పోషించాయని, కానీ నేడు మీడియా మొత్తం టీఆర్‌పీ చుట్టూ పరుగులు తీస్తోందన్నారు. భారతీయ సమాజంలో మున్ముందు పెను సవాళ్లు ఉన్నాయని సురేశ్ జీ సో నీ పేర్కొన్నారు.

Nirmala seetharaman
Union minister
India
whatsapp
  • Loading...

More Telugu News