KTR: ఇప్పుడు ప్రజలు 'నేనొస్తా బిడ్డో సర్కార్ దవాఖానాకు' అంటున్నారు: మంత్రి కేటీఆర్
- ప్రజలందరికీ ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు
- మానవీయ కోణంలో సర్కార్ ఉచిత వైద్య సేవలు
- వైద్యారోగ్య రంగంలో గుణాత్మక మార్పు
- అన్ని జిల్లా కేంద్రాలకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్
తెలంగాణ సర్కార్ మానవీయ కోణంలో రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తోందని, అందువల్లే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకే ప్రజలు ఎక్కువగా వస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. 'నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు' అనే పరిస్థితి పోయి 'నేనొస్తా బిడ్డో సర్కార్ దవాఖానాకు' అని ప్రజలు అనే పరిస్థితి వచ్చిందని అన్నారు. వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక చర్యల కారణంగా గుణాత్మక మార్పు వచ్చిందన్నారు.
మరోవైపు అన్ని జిల్లాల దవాఖానాల్లోనూ స్పెషాలిటీ వైద్యాన్ని విస్తరిస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర ప్రజలకు వైద్య పరీక్షలు చేసి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తామని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. ఈరోజు ఆయన తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి హైదరాబాద్ లోని నారాయణగూడ ఐపీఎం ఆవరణలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... "ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే పరిస్థితి ఉండేది. అప్పటి పరిస్థితులకు అద్దం పడుతూ అప్పటి కవులు ఆ విధంగా పాటలు రాశారు. ప్రజలూ ఆదరించారు. కానీ నేటి పరిస్థితులు వేరు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత వైద్యం రంగం అద్భుత ప్రగతి సాధించింది. ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు, వైద్య రంగంలో గుణాత్మక మార్పులు తెచ్చింది. మంత్రి లక్ష్మారెడ్డి కృషి ఫలితంగా సత్ఫలితాలు వచ్చాయి.
అందుకే సర్కార్ దవాఖానాల మీద ప్రజలకు నమ్మకం పెరిగింది. 20 ఐసీయూలు, 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. కేసీఆర్ కిట్ లాంటి హిట్ పథకాలను అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్ లో 17 బస్తి దవాఖానాలు ప్రారంభించాం. త్వరలోనే ఈ సంఖ్యను 45కి పెంచుతాం. నగరంలో మొత్తం 1000 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం.
హైదరాబాద్‌లోని ఐపీఎంలోని డయాగ్నోస్టిక్స్ కేంద్రంగా 8 ఏరియా ఆసుపత్రుల నుంచి 120 సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి సేకరించిన రక్త నమూనాల పరీక్షలు ఇక్కడ జరుగుతుండటం గొప్ప విషయం. ఒక గంటలో 20 నుంచి వెయ్యి వరకు పరీక్షల రిపోర్టులు తేగలిగే స్థాయి గల అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి" అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోన్న టాటా ట్రస్ట్‌ని మంత్రి అభినందించారు.