Telugudesam: టీడీపీలోని చేపలను ఈ వలేసి పట్టుకుని.. ఉప్పుచేపల్లా ఎండబెడదాం: పవన్ కల్యాణ్
- యలమంచిలిలో పవన్
- వలను బహూకరించిన ఓ మత్స్యకారుడు
- అవినీతి చేపలను పట్టి బయటపడేద్దామన్న జనసేనాని
సమస్యలపై బలంగా మాట్లాడి, నిలదీసి జనసేన ప్రభుత్వాన్ని నెలకొల్పుదామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకే తాను సినిమాలు వదిలేసి వచ్చానని చెప్పారు. ఈరోజు విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలిలో కొనసాగిస్తోన్న జనపోరాట యాత్రలో ఆయనకు ఓ మత్స్యకారుడు చేపలు పట్టే వలను బహూకరించారు.
అలాగే, తాటాకులతో తయారు చేసి వారిచ్చిన టోపీని పవన్ తలకు ధరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... టీడీపీలోని అవినీతి చేపలను ఈ వలతో పట్టుకుని.. బయటవేసేద్దామని అన్నారు. ఉప్పుచేపల్లా ఎండబెడదామని వ్యాఖ్యానించారు. అలాగే తనకిచ్చిన ఆ టోపీని తాటాకులతో ఎంతో అందంగా తయారు చేశారని అన్నారు.
కాగా, గత పుష్కరాల్లో నిధుల దుర్వినియోగాన్ని గురించి తాను రాజమహేంద్ర వరం పర్యటనలో బయటపెడతానని పవన్ చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ఆ విషయాన్ని తాను ఇప్పుడు ప్రస్తావించాలనుకోవట్లేదని, ఇప్పుడు టీడీపీ రాష్ట్రాన్ని మోసం చేస్తోందని అన్నారు. ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే సుజన స్రవంతి పథకం కింద అందరికీ నీళ్లు వచ్చి ఉండేవని అన్నారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు చంద్రబాబు ఆయనకు విలువ ఇవ్వలేదని ఆరోపించారు.