school fee: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల అడ్డగోలు పెంపునకు చెక్ పెట్టనున్న కేంద్రం
- పలు వర్గాలతో సంప్రదింపుల ద్వారా దీనిపై ఏకాభిప్రాయం
- ఆ తర్వాతే అమలు
- ఏటా అడ్మిషన్, యూనిఫామ్ చార్జీలు వసూలుపైనా నిషేధ ప్రతిపాదన
ప్రైవేటు పాఠశాలలు ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను బాదేస్తుండడంతో, వీటికి ముకుతాడు వేయాలని కేంద్రం భావిస్తోంది. ఏటా పద్ధతి లేని పెంపును నియంత్రించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి మీడియాకు వివరాలు తెలిపారు. దీన్ని అమలు చేసే ముందు ఏకాభిప్రాయం కోసం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరపనున్నట్టు ఆ అధికారి చెప్పారు. ఇటీవలే యూపీ ప్రభుత్వం పాఠశాలల ఫీజుల పెంపును కట్టడి చేస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గుజరాత్, మహారాష్ట్ర సైతం ఇదే విధమైన చర్యలు తీసుకున్నాయి.
యూపీలో ఫీజులను వార్షికంగా 8 శాతానికి మించి పెంచకుండా అక్కడి ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఈ నిబంధన అన్ని ప్రైవేటు పాఠశాలలకు వర్తింపజేసింది. క్యాపిటేషన్ ఫీజు వసూలును కూడా నిషేధించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తాను తీసుకొచ్చే చట్టంలో మరిన్ని నియంత్రణలు ప్రవేశపెట్టనుంది. ఏటా అడ్మిషన్ చార్జీ, స్కూల్ యూనిఫాం చార్జీలను కూడా వసూలు చేయకుండా నియంత్రించనుంది. ఉల్లంఘిస్తే జరిమానాలతోపాటు పాఠశాలల గుర్తింపును రద్దు చేయనుంది.