YSRCP: వైసీపీ ఎంపీల రాజీనామాలకు నేడు ఆమోదముద్ర పడే అవకాశం!
- ఇంతవరకు ఆమోదం పొందని వైసీపీ ఎంపీల రాజీనామాలు
- నేడు మధ్నాహ్నం బెలారస్, లాత్వియాల పర్యటనకు వెళ్తున్న సుమిత్ర
- ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదన్న లోక్ సభ సచివాలయ సిబ్బంది
రెండు రోజుల క్రితం లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా వైసీపీ ఎంపీలు కోరిన సంగతి తెలిసిందే. ఇంతవరకు వారి రాజీనామాలకు ఆమోద ముద్ర పడలేదు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటరీ బృందంతో కలిసి 10 రోజుల బెలారస్, లాత్వియాల పర్యటనకు సుమిత్ర వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీల రాజీనామాలకు నేడు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని లోక్ సభ సచివాలయ సిబ్బంది తెలిపారు.
మరోవైపు, రాజీనామాలను ఆమోదిస్తున్నట్టు ఆమె సంతకం చేసిన మరుక్షణం నుంచి రాజీనామాల ఆమోదం అమల్లోకి వస్తుందని సచివాలయ సిబ్బంది చెప్పారు. ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండకపోవచ్చని వారు స్పష్టం చేశారు. 16వ లోక్ సభ మే 18న ఏర్పడింది. తొలి సమావేశం జూన్ 4న జరిగింది. లోక్ సభ ఏర్పడినప్పటి నుంచి లెక్కించి... ఏడాదిలోపు సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే... ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండదని తెలిపారు.