Jagan: రాజకీయ పార్టీల చేతిలో ఆయన ఓ పావులా మారారు!: జగన్‌తో రమణ దీక్షితులు భేటీపై టీడీపీ నేత ఉమా మహేశ్వరరావు

  • రమణ దీక్షితులు బీజేపీ నేతలను కూడా కలిశారు
  • రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా మాట్లాడుతున్నారు
  • దానికి నిదర్శనమే జగన్‌ను కలవడం
  • శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు

పాదయాత్రకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ స్పందించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.... "మేము మొదటి నుంచి చెబుతున్నాం, ఇందులో రాజకీయ కుట్ర ఉంది. దీర్ఘకాలం ప్రధానార్చకుడిగా పనిచేసిన ఆయన రాజకీయ పార్టీల చేతిలో ఓ పావులా మారి ఆరోపణలు చేస్తున్నారు.

రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు టీటీడీ ఈవో ఇప్పటికే అన్ని ఆధారాలతో సమాధానాలు చెప్పారు. వివరణ ఇచ్చాం. రమణ దీక్షితులు బీజేపీ నేతలను కూడా కలిశారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా మాట్లాడుతున్నారు. దానికి నిదర్శనమే జగన్‌ను కలవడం. 30 ఏళ్లుగా స్వామి సేవలో ఉన్న ఆయన శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. తిరుమల అపవిత్రతకు కారణమవుతున్నారు" అన్నారు.

తమ కష్టాలను చెప్పుకునే అవకాశం ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని, తాను చాలా సార్లు విజయవాడ వెళ్లినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని రమణ దీక్షితులు అన్న మాటలపై బోండా స్పందిస్తూ... రమణ దీక్షితులుని చంద్రబాబు చాలా సార్లు కలిశారని, కొన్ని నెలల క్రితం చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ తో పాటు కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి కూడా వెళ్లారని, అప్పుడు కూడా కలిశారని అన్నారు. అమరావతికి రమణ దీక్షితులు వస్తే ఎప్పుడైనా సరే చంద్రబాబును కలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.  

Jagan
TTD
Bonda Uma
  • Loading...

More Telugu News