Pawan Kalyan: సీఎం చంద్రబాబు గారి భాషలో అవినీతికి నిర్వచనం ఏమిటో?: పవన్ కల్యాణ్
- నా పరిపాలనలో అవినీతి ఎక్కడ ఉందని సీఎం ప్రశ్నిస్తున్నారు!
- ఒకసారి..గూడ గ్రామానికి వచ్చి చూడండి
- ఓ నాయకుడు అక్రమ మైనింగ్ చేస్తూ నష్టం కలిగిస్తున్నారు
- ప్రకృతిని విధ్వంసం చేస్తుండటం అవినీతి కాదా?
తన పరిపాలనలో అవినీతి ఎక్కడ ఉందని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని, విశాఖపట్టణం జిల్లాలోని పాడేరు దగ్గర ఉన్న గూడ గ్రామానికి ఆయన ఒకసారి వచ్చి చూస్తే అవినీతి అంటే ఏమిటో తెలుస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘జనసేన’ పోరాట యాత్రలో భాగంగా పాడేరులో ఈరోజు పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గూడ గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఓ నాయకుడే అక్రమ మైనింగ్ చేస్తూ రూ.9 కోట్లు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ‘బాంబులు పెట్టి కొండలు పేల్చి.. ప్రకృతిని విధ్వంసం చేస్తుండటం అవినీతి కాదా? మరి, ముఖ్యమంత్రి గారి భాషలో అవినీతికి నిర్వచనం ఏమిటో చెప్పాలి?’
ఇదే గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఒకే ఒక్క ఊట బావి ఉంది. దాని పక్కనే మైనింగ్ చేస్తున్నారు. వాటి నుంచి వచ్చే విషపదార్థాలు ఆ నీటిలో కలిసిపోయి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా కొండలు తవ్వేస్తున్నారు! ఇది అవినీతి కాదా? గిరిజన గ్రామాలకు వెళ్లేందుకు కనీసం రోడ్లు కూడా లేవు.
కానీ, పంచాయతీరాజ్ నిధుల నుంచి చిత్తూరు జిల్లాలో హెరిటేజ్ కేంద్రాలకు రోడ్లు వేయించుకున్నారు... మంత్రి నారా లోకేశ్ తన పంచాయతీ శాఖ రోడ్లను ‘హెరిటేజ్’ కు వేయించుకున్నారు. ఇక, ఐటీ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో విశాఖపట్టణంలో చెబుతా! మన్యంలో గ్రానైట్ దోపిడీయే ఈవిధంగా ఉంటే బాక్సైట్ ఇక ఏ విధంగా ఉంటుందో? ముఖ్యమంత్రి 2050 విజన్ అంటున్నారు.
ఇలాగే, అక్రమంగా కొండలు తవ్వితే 2050 నాటికి అరకు ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఒక పథకం ప్రకారమే గిరిజన ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నారు. కేంద్రం కొత్తగా ఓ చట్టం చేయబోతోంది. ఈ చట్టం ద్వారా అటవీ భూములపై గిరిజనులకు హక్కులు లేకుండా చేయడంతోపాటు, గిరిజనేతరులకీ హక్కులు ఇవ్వబోతున్నారు. దీనిని చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించడం లేదు? వైసీపీ వాళ్లు ఎందుకు మాట్లాడట్లేదు?’ అని ప్రశ్నించారు.
‘కేంద్రానికి, ప్రధానికి నేను ఒకటే చెబుతున్నా..ఇలాంటి అన్యాయమైన చట్టం చేస్తే గిరిజనులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది.. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామంలో ఎన్టీఆర్ సుజల పథకం పని చేయట్లేదు. రక్షిత తాగునీరు కూడా గిరిజన గ్రామాలకు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. మరుగుదొడ్ల నిర్మాణంలోనూ అక్రమాలే! ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ మరుగుదొడ్లలోనూ కక్కుర్తి చేయడానికి సిగ్గులేదా?..గిరిజన ప్రాంతాల్లోని సమస్యలన్నింటిని జనసేన పార్టీ అర్థం చేసుకుంది. ఈ సమస్యలకు తగిన పరిష్కరం చూపుతుంది. మన్య ప్రాంతంపై గిరిజనేతరులకు హక్కులు ఇచ్చి, గిరిజనులకు అన్యాయం చేస్తే జనసేన పోరాటం చేస్తుంది’ అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.