Prime Minister: అందుబాటు ధరలకే వైద్య సేవలు అందించే ప్రయత్నంలో ఉన్నాం: ప్రధాని మోదీ
- పేదవారు ఔషధాలను కొనాలంటే ఆందోళన చెందే పరిస్థితి
- స్టెంట్ల ధరలు తగ్గించడం వల్ల పేదలు, మధ్యతరగతికి మేలు
- 2025 నాటికి టీబీని నిర్మూలిస్తామని ప్రకటన
ఔషధాలను కొనుగోలు చేయడం అన్నది పేదవారికి పెద్ద సమస్యగా మారిందని, తమ ప్రభుత్వం ప్రతి ఒక్క పౌరుడికి అందుబాటు ధరలకే వైద్య సేవలు అందించాలనుకుంటున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ‘ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన కార్యక్రమం’ లబ్ధిదారులతో మోదీ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ‘‘పేదవారు ఔషధాలను పొందడం అన్నది ఆందోళన కలిగించే అంశం. ప్రతీ భారతీయుడికి అందుబాటు ధరలకే వైద్య సేవలు అందించాలన్నదే మా నిరంతర ప్రయత్నం’’ అని చెప్పారు. అందుబాటు ధరలకే ఔషధాలను అందించడం కోసమే భారతీయ జనఔషధి పరియోజన కార్యక్రమం ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.
స్టెంట్ ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. పేదవారు, మధ్య తరగతి వారికి దీని వల్ల ఎంతో మేలు కలిగిందన్నారు. భారత్ లో క్షయ వ్యాధి (టీబీ)ని 2025 నాటికి నిర్మూలించాలని లక్ష్యాన్ని విధించుకున్నట్టు ప్రధాని చెప్పారు. ఇది ప్రపంచ డెడ్ లైన్ కంటే ఐదేళ్లు ముందే కావడం గమనార్హం.