prattipati: వేర్వేరుగా బియ్యం, ఆరోగ్య కార్డులు.. ఏపీ ప్రభుత్వ యోచన
- కొత్తగా 2.42 లక్షల తెల్ల రేషన్ కార్డులు
- రాష్ట్రంలో ప్రస్తుతం 83 చంద్రన్న విలేజ్ మాల్స్
- ప్రజా సాధికార సర్వే కొనసాగింపు
- 12.50 లక్షల ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు
బియ్యం, ఆరోగ్య కార్డులు వేరువేరుగా ఇవ్వాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. అమరావతిలోని ఏపీ సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ఛాంబర్ లో ఉదయం సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఎండీ ఏ సూర్యకుమారి, కేపీఎంజీ ప్రతినిధి శ్రీనివాసరావు, చంద్రన్న విలేజ్ మాల్స్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు, కమిటీ సభ్యులతో సమావేశమై వారి సమస్యలు చర్చించినట్లు తెలిపారు. కొత్తగా 2.42 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
వీటిలో కొన్ని ఉన్నవాటిలో రద్దయినవి కూడా ఉన్నట్లు తెలిపారు. పేదవారు ఎవరూ ఇబ్బంది పడకుండా కార్డులు జారీ చేస్తామన్నారు. ఆ తరువాత కార్డులలో మార్పులు, చేర్పులు చేసి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రస్తుతం కోటి 44 లక్షల కార్డులు ఉన్నాయని, ఇప్పుడు మరో 2.42 లక్షల కార్డులు ఇస్తామని, మార్పులు, చేర్పులు చేయవలసిన కార్డులు ఇంకో 3.80 ఉన్నట్లు తెలిపారు.
ఇల్లు, ఆరోగ్యం, ఇతర లబ్ధి కోసం తెల్ల కార్డులు కావాలన్న ఒత్తిడి పెరుగుతోందని, వారిలో చాలా మంది బియ్యం తీసుకోవడం లేదని, అందువల్ల ఆ ఒత్తిడి తగ్గడానికి బియ్యం కార్డులు, ఆరోగ్య కార్డులు వేరు చేసే ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం భారీ స్థాయిలో కందులను కొనుగోలు చేసిందని, అందువల్ల ఒక్కో తెల్ల కార్డుకు నెలకు రెండు కిలోల నాణ్యమైన కంది పప్పు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే కిలో ధర రూ.40 కాకుండా, రూ.30 లకు ఇవ్వాలన్న ఆలోచన ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అనుమతి తీసుకొని ఇస్తామని చెప్పారు.
83 చంద్రన్న విలేజ్ మాల్స్..
రాష్ట్రంలో ప్రస్తుతం 83 చంద్రన్న విలేజ్ మాల్స్ నిర్వహిస్తున్నట్లు, ఈ నెలలో మరో 71 మాల్స్ ప్రారంభించడంతో అవి 144కి చేరతాయని ప్రత్తిపాటి తెలిపారు. ఒక్కో షాపుకు రూ.15 వేల నుంచి రూ.18 వేల రూపాయల వరకు ఆదాయం వస్తున్నట్లు చెప్పారు. తెనాలిలో ఓ మాల్ కు రూ.18 వేల రూపాయలు, హిందూపురంలో మరో మాల్ కు రూ.15 వేలు వచ్చినట్లు వివరించారు.
అయితే, కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు బయట మార్కెట్ కు, విలేజ్ మాల్స్ కు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు తెలిసిందన్నారు. వినియోగదారులకు 60 శాతం, డీలర్ కు 40 శాతం లాభం చేకూరాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొన్ని వస్తువులు ప్యాకింగ్ లేకుండా విడిగా అమ్మితే వినియోగదారుడికి తక్కువ
ధరతోపాటు డీలర్ ఆదాయం పెరుగుతుందన్నారు.
చౌక ధరల దుకాణాలను మాల్స్ గా మార్చడం వల్ల వారికి సరఫరా చేసే విద్యుత్ కు వాణిజ్య ఛార్జీలు వసూలు చేస్తున్నారని, దానిని గృహ వినియోగ ఛార్జీలు వసూలు చేయాలని డీలర్లు కోరుతున్నారని, అది న్యాయమైన కోరికేనని ప్రత్తిపాటి అన్నారు. విద్యుత్ శాఖతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కమీషన్ పెంచాలని డీలర్లు కోరుతున్నట్లు తెలిపారు. డీలర్ల తరపున ప్రతి జిల్లా నుంచి ఒకరి చొప్పున ఎంపిక చేసి, ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, వారితో ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తామన్నారు.
సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరిస్తామని ప్రత్తిపాటి చెప్పారు. వారికి ఈ మాల్స్ పై అవగాహన కలిగించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని విస్తరింపజేస్తామని చెప్పారు. రిలయన్స్ సంస్థతో ఒప్పందం (ఎంఓయు) చేసుకోవలసి ఉందని, ఒప్పందం కుదిరిన తరువాత మాల్స్ లో తరలించడానికి అనువైన ర్యాక్ లు, బోర్డులు వంటి వాటికి అయిన ఖర్చును వారే భరిస్తారన్నారు.
ప్రజా సాధికార సర్వే కొనసాగింపు..
ప్రజా సాధికార సర్వేలో నమోదు కాకుండా ప్రభుత్వ ఇల్లు మంజూరు కాదని మంత్రి చెప్పారు. అందువల్ల ఆ సర్వే కింద నమోదు కానివారు, తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి, దానిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆ సర్వే పరిధిలోకి రానివారు దాదాపు 30 లక్షల మంది ఉన్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 12.50 లక్షల ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగ జరుపుకోవడానికి రంజాన్ తోఫాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఈ తోఫాలో 8 కిలో 100 గ్రాముల నాణ్యమైన సరుకులు అందజేస్తున్నట్లు చెప్పారు. గడచిన నాలుగేళ్లో సంక్రాంతి, రంజాన్, క్రిస్టమస్ సందర్భంగా తమ ప్రభుత్వం రూ.14.51 కోట్ల విలువైన ఆహార పదార్థాలు ఇచ్చినట్లు మంత్రి పుల్లారావు వివరించారు.