Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో మొదలైన అలకలు.. ఎస్ఆర్ పాటిల్ రాజీనామా
- డిప్యూటీ సీఎం పదవి ఆశించి భంగపడిన పాటిల్
- వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా
- ఇటీవలి ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత
లింగాయత్ కోటాలో డిప్యూటీ సీఎం పదవిని ఆశించి భంగపడిన కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్ఆర్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన చెబుతున్నా, కారణం అదికాదని తెలుస్తోంది.
జేడీఎస్‌తో పొత్తుపై తనకు మాటమాత్రమైనా చెప్పకపోవడం, లింగాయత్ కోటాలో డిప్యూటీ సీఎం పదవిని ఆశించి భంగపడడం వంటి కారణాలతో ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. గత నెల 25 న రాజీనామా లేఖను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి పంపించారు. రాహుల్ ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిందని, కానీ ఎన్నికల్లో పార్టీని గెలుపు దిశగా నడిపించలేకపోయానని పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థులను విజయాలవైపు నడిపించలేకపోయిన తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తన రాజీనామాకు అదే కారణమని వివరించారు. అయితే, పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానంపై అలకతోనే ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు.