Rains: చల్లబడ్డ తెలుగు రాష్ట్రాలు... భారీ వర్ష సూచన!
- గత రెండు నెలలుగా భానుడి ప్రతాపం
- నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి
- విస్తారమైన వర్షాలకు అవకాశం
గడచిన రెండు నెలలుగా భానుడి ఉష్ణోగ్రతను, ఇదే సమయంలో అప్పుడప్పుడూ అకాల వర్షాలను చవిచూసిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించినట్లేనని, నైరుతి రుతుపవనాలు కేరళను దాటి తమిళనాడు, రాయలసీమ మీదుగా తెలంగాణ వైపు విస్తరిస్తున్నాయని తెలిపింది.
మరోపక్క, హైదరాబాద్ లో ఈ ఉదయం నుంచి ప్రజలు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగినట్టు తెలుస్తోంది. సత్తుపల్లి, వరంగల్ ప్రాంతాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు స్వల్ప అంతరాయాలు కలిగాయి.
అటు ఏపీలోని ద్వారకా తిరుమల, ఏలూరు, భీమవరం తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయని, వీటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అల్పపీడన ద్రోణి, క్యుములో నింబస్ మేఘాలు కలిసిన కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.