Chandrababu: అప్పుడు సైలెంట్ గా ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు జనాలను రెచ్చగొడుతున్నారు: చంద్రబాబు
- విభజన సమయంలో పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు
- బీజేపీతో టీడీపీ విభేదించిన తర్వాత విమర్శలు మొదలుపెట్టారు
- ఆపరేషన్ గరుడను అమలు చేస్తున్నట్టే కనబడుతోంది
కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ విభేదించిన తర్వాత నుంచే తమపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పవన్ కల్యాణ్ ఒక్కమాట అయినా మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఆయన ఏమాత్రం స్పందించడం లేదని చెప్పారు. ఏపీని అస్థిరపరిచే కార్యక్రమాన్ని బీజేపీ చేస్తోందని... రాయలసీమ డిక్లరేషన్ తో ప్రాంతాల మధ్య చిచ్చు రాజేసేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
చివరకు తిరుమలను కూడా అధీనంలోకి తీసుకునేందుకు యత్నించిందని విమర్శించారు. వారణాసికి, తిరుమలకు ఏమాత్రం పోలిక లేదని, తిరుమల ఎంతో పరిశుభ్రంగా ఉంటుందని చెప్పారు. రమణ దీక్షితులుతో టీటీడీపై ఆరోపణలు చేయిస్తోందని దుయ్యబట్టారు. ఆపరేషన్ గరుడను అమలు చేస్తున్నట్టే కనిపిస్తోందని... ఎన్ని ప్రయత్నాలు చేసినా, బీజేపీ కుట్ర రాజకీయాలను ఏపీలో సాగనివ్వబోమని చెప్పారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ప్రసంగిస్తూ చంద్రబాబు పైవ్యాఖ్యలు చేశారు.