Pawan Kalyan: అమ్మో! జనసేన లేకుంటే.. టీడీపీ, వైసీపీలు ఊళ్లు పంచుకునేవి: పవన్
- టీడీపీ, వైసీపీలపై పవన్ నిప్పులు
- లంచానికి రసీదులివ్వరన్న జనసేనాని
- స్థానిక టీడీపీ నేతలనూ వదిలిపెట్టని పవన్
పోరుయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలోని సాలూరు, గజపతినగరంలో పర్యటిస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలపై నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ కనుక ఆవిర్భవించకుంటే ఈ రెండు పార్టీలు కలిసి ఊళ్లను పంచుకుని ఉండేవని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆ విషయాన్ని తలచుకుంటేనే భయమేస్తోందన్నారు. అవినీతి జరిగినట్టు నిరూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాలు చేస్తున్నారని, లంచాలు తీసుకునే వారు రసీదులు ఇస్తారా? అని ప్రశ్నించారు.
స్థానిక టీడీపీ నేతలనూ పవన్ వదలిపెట్టలేదు. గిరిజనుడు కాని భాంజ్‌దేవ్‌ను టీడీపీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారని పేర్కొన్న ఆయన, సాగునీటిని ఆయన చేపల చెరువులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా చేపల చెరువులకు మాత్రం నీళ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ పోస్టులను సైతం టీడీపీ నాయకులు లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నారని అన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 2019లో జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పవన్ చెప్పుకొచ్చారు.