Telangana: తెలంగాణలో చంద్రబాబు పార్టీ గెలవదు కాబట్టి.. అక్కడ బీసీకి సీఎం పదవి ఇస్తానన్నారు: జగన్
- నరసాపురంలో జగన్ ర్యాలీ
- బీసీలు జడ్జీలు కాకూడదంటూ చంద్రబాబు లేఖలు రాశారు
- ఇదీ ఆయనకి బీసీలపై ఉన్న ప్రేమ
అసత్యాలు చెప్పడం, మోసాలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెంబర్ వన్‌గా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ నిర్వహించిన మహానాడులో అన్నీ అసత్యాలే చెప్పారని అన్నారు.
"బీసీలు జడ్జీలు కాకూడదంటూ చంద్రబాబు లేఖలు రాశారు. ఇదీ ఆయనకి బీసీలపై ఉన్న ప్రేమ. కానీ, ఈ పెద్దమనిషి మహానాడులో ఏమన్నాడో తెలుసా? తెలంగాణలో ఎలాగో అధికారంలోకి రారని తెలుసు కాబట్టి.. అక్కడ అధికారంలోకి వస్తే బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు తెలంగాణలో 12 మంత్రి పదవులు ఇస్తానని అన్నారు.
ఇక్కడ ఏపీలో అధికారంలో ఉన్నారు.. కానీ, ఆయా సామాజిక వర్గాల నేతలకు ఒక్కటంటే ఒక్క మంత్రి పదవయినా ఇచ్చిన పాపాన పోలేదు ఈ మనిషి. ఇంతకన్నా మోసం చేసేవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా?" అని జగన్ అన్నారు.
అలాగే, చంద్రబాబు నాయుడు మహానాడులో 'ఏపీలో అందరికీ మినరల్ వాటర్ అందిస్తున్నామని అంటున్నారు, మరి మీకు మినరల్ వాటర్ అందుతోందా?' అని ప్రశ్నించారు. చంద్రబాబు బెల్టు షాపులు రద్దు చేస్తామని కూడా అన్నారని, మినరల్ వాటర్ లేని గ్రామం ఉంది కానీ, బెల్టు షాపులు లేని గ్రామం మాత్రం లేదని విమర్శించారు.