Kadiam Srihari: కడియం శ్రీహరి వ్యాఖ్యలపై జనగామ జర్నలిస్టుల ఆగ్రహం.. ఆయన కార్యక్రమాలకు వెళ్లరాదని నిర్ణయం!
- ప్రభుత్వ కార్యక్రమంలో సరైన ఏర్పాట్లు చేయలేదని అలిగిన జర్నలిస్టులు
- రావాలని పిలిచినా కదలని వైనం
- జర్నలిస్టులు అతి చేస్తున్నారంటూ శ్రీహరి వ్యాఖ్యలు
- నిరసన వ్యక్తం చేస్తూ, వ్యతిరేకంగా నినాదాలు చేసిన జర్నలిస్టులు
తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల పట్ల జనగామలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా కేంద్రంలో రైతుబంధు పథకం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై జరిగిన సమీక్షా సమావేశానికి కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా తమకు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని... అధికారులకు మాత్రం కూలర్లు, ఫ్యాన్లను ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ... జర్నలిస్టులంతా పక్కన ఉన్న షెడ్డులోకి వెళ్లి కూర్చున్నారు.
దీన్ని గమనించిన కడియం శ్రీహరి జర్నలిస్టులను పిలవాలంటూ అధికారులకు చెప్పారు. వారు జర్నలిస్టుల వద్దకు వచ్చి కోరినా... జర్నలిస్టులు అక్కడి నుంచి కదల్లేదు. చివరకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వచ్చి జర్నలిస్టులతో మాట్లాడుతుండగా.... కడియం శ్రీహరి కల్పించుకుని జర్నలిస్టులు అతిగా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. టైమ్ వేస్ట్ చేయవద్దని, జర్నలిస్టులు రాకపోయినా మీరు వచ్చేయండని అన్నారు. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు బయటకు వచ్చి కడియం శ్రీహరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇకపై జిల్లాలో శ్రీహరి సమావేశాలకు వెళ్లరాదని నిర్ణయించారు.