India: లీటరు రూ. 80 దాటి రూ. 90 దిశగా... పరుగాపని పెట్రోలు!
- వరుసగా 16వ రోజు కూడా పెరిగిన ధరలు
- ముంబైలో రూ. 86.24, హైదరాబాద్ లో రూ. 83.08
- ఫ్యూచర్స్ ట్రేడింగ్ కు ఆమోదం పలకనున్న పెట్రోలియం శాఖ
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 16వ రోజు కూడా పెరిగాయి. కర్ణాటక ఎన్నికలకు ముందు 19 రోజుల పాటు మారని 'పెట్రో' ఉత్పత్తుల ధరలు, ఎన్నికల తరువాత ఇంతవరకూ పరుగాపలేదు. నేడు పెట్రోల్ ధర లీటరుకు 16 పైసలు, డీజిల్ ధర లీటరుకు 14 పైసలు పెరిగింది. పెట్రోలుపై సుంకాలు అధికంగా వడ్డిస్తున్న ముంబైలో పెట్రోలు ధర రూ. 90 దిశగా పరుగులు పెడుతోంది.
తాజాగా పెంచిన ధరతో లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ. 78.43 ఉండగా, ముంబైలో రూ. 86.24కు, హైదరాబాద్ లో రూ. 83.08కి చేరింది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ. 69.31, ముంబైలో రూ. 73.79, హైదరాబాద్ లో రూ. 75.34కు పెరిగింది. అతి త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే చర్యలు చేపడతామని, చమురు మార్కెట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ కు ఆమోదం తెలుపుతున్నామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించిన మరుసటి రోజు కూడా ధరలు పెరగడం గమనార్హం.