India: ఇండియా, రష్యాల మధ్య ఆయుధ వ్యాపారంపై అమెరికా అక్కసు!
- రష్యాతో రూ. 40 వేల కోట్ల విలువైన డీల్
- ఎస్-400 బాలిస్టిక్ క్షిపణులు కొనే ఒప్పందం
- ఆయుధాలతో కూడిన డ్రోన్లను నిలిపే ఆలోచనలో అమెరికా
రష్యా నుంచి సుమారు రూ. 40 వేల కోట్ల విలువ చేసే ఎస్-400 బాలిస్టిక్ మిసైల్ షీల్డ్ లను కొనుగోలు చేసేందుకు ఇండియా డీల్ కుదుర్చుకుంటున్న వేళ, అమెరికా తన అక్కసు ప్రదర్శించింది. ఇండియాకు ఆయుధాలతో కూడిన డ్రోన్ లను విక్రయించేందుకు గతంలో అంగీకరించిన అమెరికా, ఇప్పుడు ఆ డీల్ ను రద్దు చేసుకోవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని యూఎస్ హౌస్ ఆర్మ్ డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ విలియమ్ థ్రాన్ బెర్రీ చూచాయగా చెప్పారు. రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేయాలన్న భారత ఆలోచనతో తాము ఆ దేశంతో భవిష్యత్ ఆయుధ డీల్స్ ను జరిపే విషయమై పునరాలోచనలో పడ్డట్టు తెలిపారు.
అమెరికాకు చెందిన మిలటరీ సేవలు, ఢిఫెన్స్ ఏజన్సీస్ కు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే ఆయన, గత నెలలో ఆయుధాల ఎగుమతిపై ట్రంప్ సర్కార్ అనుమతులు ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తూనే, రష్యాకు చెందిన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ను భారత్ కొనుగోలు చేస్తుండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు.
కాగా, మిలటరీ సంబంధాల విషయంలో భారత దేశం, అటు రష్యాను, ఇటు అమెరికాను సమానంగానే చూస్తున్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో పొంచివున్న ప్రమాదాలను ఎదుర్కోవడంతో పాటు, ఇరుగు, పొరుగు దేశాల నుంచి వచ్చే సవాళ్లను అధిగమించేందుకు ఆయుధ సంపత్తిని ఆధునికీకరించుకునేందుకు వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతోంది.