YSRCp: వైసీపీ ఎంపీల రాజీనామాలపై అటా, ఇటా తేల్చనున్న స్పీకర్!
- ఏప్రిల్ 6న రాజీనామాలు చేసిన ఎంపీలు
- స్పీకర్ ఫార్మాట్ లో ఉండటంతో వారితో చర్చించనున్న సుమిత్ర
- నేడు స్పీకర్ ను కలవనున్న వైసీపీ ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంతో, ఏప్రిల్ 6న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నేడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నేడు వచ్చి కలవాలని వైసీపీ ఎంపీలకు స్పీకర్ కార్యాలయం లేఖలు పంపిన సంగతి తెలిసిందే. ఎంపీలు తమ రాజీనామాలను భావోద్వేగంతో చేశారా? లేక, నిజంగానే సీరియస్ గా ఉన్నారా...? అన్న విషయాన్ని పరిశీలించి, ఆపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్ లోనే ఉన్నాయన్న సంగతి తెలిసిందే.
కర్ణాటకకు చెందిన ఇద్దరు లోక్ సభ సభ్యులు యడ్యూరప్ప, శ్రీరాములు ఎమ్మెల్యేలుగా గెలిచిన తరువాత, బల నిరూపణలో ఓటు వేసేందుకు ఎంపీ పదవులకు రాజీనామాలు చేయగానే, స్పీకర్ కార్యాలయం వాటిని ఆమోదించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నెలన్నర క్రితమే రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలపై నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్న వేళ, స్పీకర్ కార్యాలయం నుంచి వైసీపీ ఎంపీలకు పిలుపురావడం గమనార్హం.