patanjali: ఇకపై ‘పతంజలి’ సిమ్ కార్డులు!
- టెలికాం సెక్టార్ లోకి అడుగుపెట్టనున్న పతంజలి సంస్థ
- బీఎస్ ఎన్ ఎల్- పతంజలి ఒప్పందం
- స్వదేశీ - సమ్ రాధి సిమ్ కార్డులు త్వరలో మార్కెట్లోకి
వినియోగ వస్తువుల ఉత్పత్తి (కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్) లో దూసుకుపోతున్న పతంజలి ఆయుర్వేద్ సంస్థ టెలికాం సెక్టార్ లోకి అడుగుపెట్టనుంది. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ ఎన్ ఎల్) తో పతంజలి సంస్థ ఒప్పందం చేసుకుందని యోగ గురువు, సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ తెలిపారు. ఈ ఒప్పందం మేరకు స్వదేశీ - సమ్ రాధి సిమ్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేయనున్నామని ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.
ఈ సంస్థ అందించే సిమ్ కార్డు ద్వారా కేవలం రూ.144తో రీఛార్జి చేసుకుంటే దేశ వ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా, 2 జీబీ డేటా ప్యాక్ తో పాటు 100 ఎస్ఎమ్మెస్ లు పంపుకోవచ్చని పేర్కొన్నారు. అయితే, తమ సంస్థకు చెందిన ఉద్యోగులు, అధికారులకు మాత్రమే తొలుత ఈ సిమ్ కార్డ్ ప్రయోజనాలు పొందనున్నట్టు ప్రకటించారు.
ఈ సిమ్ కార్డులు ఉపయోగించే వినియోగదారులకు తమ సంస్థ ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తామని తెలిపారు. అంతే కాకుండా, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమా కూడా ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ ఎల్ కౌంటర్ల ద్వారా ఈ సిమ్ కార్డులను అందజేస్తామని చెప్పారు.