Palghar: ఉప ఎన్నికల్లో అవసరమైతే రెచ్చిపోండి.. పార్టీ నేతలకు సూచించిన 'మహా' సీఎం.. వివాదాస్పద ఆడియో క్లిప్ బయటకు!
- ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ అడ్డదారులు
- సామదానభేద దండోపాయాలు ఉపయోగించాలన్న సీఎం ఫడ్నవిస్
- బయటపెట్టిన శివసేన చీఫ్
త్వరలో జరగనున్న పల్ఘర్ ఉప ఎన్నికల్లో అవసరమైతే సామదాన, భేద, దండోపాయాలు ఉపయోగించాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్న ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చి వివాదాస్పదమైంది. శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ఈ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్ఘర్ ఉప ఎన్నికల్లో శివసేనకు వ్యతిరేకంగా బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు సామదాన, భేద, దండోపాయాలు ఉపయోగించాలంటూ ఫడ్నవిస్ బీజేపీ నేతలు, కార్యకర్తలకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు.
బయటకొచ్చిన ఆడియో క్లిప్ ప్రకారం.. ఫడ్నవిస్ కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడుతూ.. ‘‘శివసేన మనల్ని వెన్నుపోటు పొడిచింది. మనతో మిత్రుడిగా ఉండి వెన్నుపోటు పొడిస్తే మనం ఎలా స్పందించాలి? శరీరంలో బీజేపీ రక్తం ఉన్న ఎవరూ సైలెంట్‌గా చూస్తూ కూర్చోరు. బీజేపీ అంటే ఏంటో తెలియాలంటే మనం పెద్ద ఎత్తున ప్రతీకారం తీర్చుకోవాలి. నేను మీకు చెబుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. సామదానభేద దండోపాయాలు ఉపయోగించండి’’ అని పేర్కొనడం స్పష్టంగా వినిపిస్తోంది.
‘‘మనం ఈ ఎన్నికల్లో గెలిస్తే వారికి చెప్పుదెబ్బ అవుతుంది. ఎవరైనా దాదాగిరి చేయాలని ప్రయత్నిస్తే.. మాక్కూడా దాదాగిరి చేయడం తెలుసు’’ అని ముఖ్యమంత్రి అన్నారని ఉద్దవ్ థాకరే ఆరోపించారు. ఈ ఆడియో క్లిప్ ఆధారంగా ముఖ్యమంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్‌ను ఉద్దవ్ కోరారు. ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని శివసేన అధికార ప్రతినిధి మనషా కయాండె పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా ఈ ఆడియో క్లిప్‌పై స్పందించారు. క్లిప్‌ను పరిశీలించి, చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరారు.