TTD: తిరుమల వైకుంఠ ద్వార మార్గంలోనే భారీ నిధి... బండల కిందే ఉందన్న అప్పటి బ్రిటిష్ కలెక్టర్ జేమ్స్ స్టార్టన్!
- తిరుమల కొండపై పలు వివాదాలు
- నిధికోసం తవ్వకాలు జరిపారంటున్న మాజీ ప్రధానార్చకులు
- ప్రస్తుతం వైకుంఠ ద్వారంగా ఉన్న ప్రదక్షిణ మార్గం
- దానికిందే విలువైన నిధివుందని తెలిపిన బ్రిటిష్ కలెక్టర్
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలపై ఇటీవలి కాలంలో పలు వివాదాలు వెల్లువెత్తుతుండగా, మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు సంచలనాన్నే రేపాయి. ఆలయంలో పూర్వీకులు దాచిన నిధి కోసం పోటును తవ్వారని, స్వామివారికి నైవేద్యం సక్రమంగా పెట్టడం లేదని, పూజలు సరిగ్గా జరిపించడం లేదని ఆయన ఆరోపించగా, గతంలో బ్రిటిష్ కలెక్టరుగా పనిచేసిన జేమ్స్ స్టార్టన్, స్వామివారి ఆలయంపై తాను రాసిన 'సవాల్ ఈ జవాబ్' పుస్తకం తెలుగు అనువాదంలోని పేజీ ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆలయం గురించి ఉన్నతాధికారులు అడిగిన ప్రశ్నలకు జేమ్స్ సమాధానాలు ఇవ్వగా, గతంలో తహసీల్దారుగా పనిచేసిన వీఎన్ శ్రీనివాసరావు వాటిని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. అందులోని వివరాల ప్రకారం... "అనేక మంది రాజులు చేతికి నరము లేని వారయి శ్రీ వెంకటేశ్వరునికి దానములు చేయడంతో ఆయన 'కోటి ఆభరణముల కధిపతి' అని పేరు గాంచినాడు. ఇంకో విశేషమేమంటే, కలికాలంలోని మనుష్యులు నమ్మదగని వారు గాబట్టి, యీ ఆభరణాలన్నింటినీ, ప్రదక్షిణ ప్రాకారంలో పూడ్చి పెట్టారట. ఈ ప్రదక్షిణ ప్రాకారం 300 గజాల పొడవు, 40 గజాల వెడల్పు కలిగివుంది. ఇంత విస్తీర్ణంలో - యీ నగలు ఎక్కడ పూడ్చి పెట్టారో ఏమో? వీటిని కనిపెట్టాలని శ్రీనివాసాచార్యులనే తహసీలుదారు ప్రయత్నించి, తనకు, తను నియమించిన పనివారికి ఉన్నట్టుండి జబ్బు రావడంతో, అది దైవాపచారంగా భావించి, తన ప్రయత్నం విరమించుకున్నాడు. ఈ విధంగా అనేకమంది ప్రయత్నించి, చివరకు విఫలులైనారని పెద్దలు చెబుతారు. ప్రస్తుతం యీ ప్రదక్షిణ ప్రాకారం మూసివేయబడివుంది. తలుపులు తాళాలు వేశారు. లోన బండరాళ్లు పలుచబడివున్నాయి. దీనినే వైకుంఠవాకిలి అంటున్నారు" అని రాసివుంది. అప్పటి పుస్తకంలోని పుటను మీరూ చూడవచ్చు.