Ireland: అబార్షన్ చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందే.. రెఫరెండంలో ఐర్లాండ్ వాసుల తీర్పు!
- అబార్షన్ చేయించుకోవాలంటే ఎన్నో నిబంధనలు
- వాటి కారణంగా 2012లో భారత మహిళ మృతి
- చట్టసవరణ చేయాలని ఉద్యమం
- ఫలించిన పోరాటం
క్యాథలిక్ సంప్రదాయాలు పాటించే ఐర్లాండ్‌లో అబార్షన్ విషయంలో కఠినమైన నిబంధనలుంటాయి. మహిళ కడుపులోని పిండానికి, తల్లికి జీవించే హక్కును ఐర్లాండ్ రాజ్యాంగం సమాన స్థాయి ఇస్తుంది. 2012లో ఐర్లాండ్‌లో ఆ నిబంధనల వల్ల ఓ భారతీయ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు రావడంతో ఆమె కడుపులో శిశువు బతికే అవకాశాలు లేవని అప్పట్లో వైద్యులు తేల్చారు. అయితే, చట్టంలోని నిబంధనలకు కారణంగా ఆమెకు అబార్షన్ చేయడానికి వైద్యులు ఒప్పుకోకపోవడమే ఆమె మృతికి కారణమైంది. దీంతో ఆ చట్టంలో సవరణ చేయాలని ఐర్లాండ్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. చివరకు ఆ చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆ దేశ ప్రభుత్వం భావించింది.
తాజాగా, గర్భం దాల్చిన మొదటి 12 వారాల్లో అబార్షన్ చేయించుకోవడానికి అనుమతించాలని చట్టాన్ని సవరించాలని నిర్ణయం తీసుకుని, ఈ విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓటింగ్ నిర్వహించింది. అబార్షన్‌ను ఈ పద్ధతిలో కొనసాగించాలా? లేక రద్దు చేయాలా? అనే విషయంపై ఆ దేశీయులు తమ ఎస్ ఆర్ నో లో ఏదైనా ఒకదానికి ఓటు వేశారు. అందులో ఎస్ అనే ఆప్షన్ కే అత్యధిక ఓట్లు వచ్చాయి. దీంతో ఇక ఐర్లాండ్ ప్రభుత్వం.. మొదటి 12 వారాల్లో అబార్షన్ చేయించుకోవచ్చని చట్టాన్ని సవరించనుంది.