Andhra Pradesh: ఏపీలో ఆక్వా సాగు రైతులకు చంద్రబాబు కానుక!
- ఆక్వా సాగుకు వినియోగించే విద్యుత్ పై మరింత సబ్సిడీ ఇస్తాం
- ఏడాది పాటు యూనిట్ రూ.2 కే విద్యుత్ సరఫరా చేస్తాం
- ప్రభుత్వంపై రూ.300 కోట్లకు పైగా అదనపు భారం పడుతుంది
- ఆక్వా రైతుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా
ఏపీలో ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు వరాలు కురిపించారు. అమరావతిలో ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆక్వా సాగుకు వినియోగించే విద్యుత్ పై మరింత సబ్సిడీ ఇస్తామని, ఏడాది పాటు యూనిట్ రూ.2 కే విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.300 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
రిజిస్ట్రేషన్ చేయకుండా ఆక్వా సాగు చేయొద్దని, ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్ ప్రయోగించడం మంచిది కాదని, పర్యావరణ హితంగా వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. కోస్తాంధ్రాలో ఆక్వా రంగాన్ని, రాయలసీమలో ఉద్యానరంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, అందుకే, విద్యుత్ ఛార్జీలు తగ్గించామని చెప్పారు. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ఆక్వా రైతులు సహకరించాలని, అప్పుడే గిట్టుబాట ధర లభిస్తుందని చెప్పారు.
కాగా, ఆక్వా సాగుకు వినియోగించే విద్యుత్ పై మరింత సబ్సిడీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత నిర్ధారణకు అత్యాధునిక లేబొరేటరీలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎంకు రైతులు విజ్ఞప్తి చేశారు.