Andhra Pradesh: ప్రభుత్వం తనకు కేటాయించిన వాహనంపై జగన్ అసంతృప్తి.. మార్చమంటూ లేఖ!
- ప్రభుత్వం తనకు కేటాయించిన వాహనం సరిగా లేదన్న జగన్
- తరచుగా మొరాయిస్తున్న వాహనం
- ఆ వాహనం మార్చాలని ఏపీ అడిషినల్ డీజీపీకి జగన్ లేఖ
ప్రభుత్వం తనకు కేటాయించిన స్కార్పియో వాహనంపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వాహనాన్ని మార్చాలంటూ ఏపీ అడిషినల్ డీజీపీకి ఇప్పటికే మూడుసార్లు జగన్ లేఖ రాశారు. తాజాగా, మరోసారి మరోసారి లేఖ రాశారు. ప్రభుత్వం కేటాయించిన వాహనం సరిగా లేకపోవడంతో ప్రస్తుతం తన సొంత వాహనం వినియోగిస్తున్నానని, కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం తనకు కేటాయించాలని ఈ లేఖలో జగన్ కోరారు.
ప్రభుత్వం తనకు కేటాయించిన వాహనం తరచుగా మొరాయిస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, శ్రీకాకుళంలో అధికారులు వాడిన డొక్కు వాహనాన్ని తనకు కేటాయించారని, ఏపీ9సీఏ 4545 వాహనం మార్చాలని, బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయినప్పటికీ ఫిట్ గా లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
కాగా, ప్రయాణ సమయంలో జగన్ వాహనాం తరచుగా ఆగిపోతుండటంతో భద్రతాపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే ఆస్కారం ఉందని జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత కర్నూలులో రెండు సార్లు ఈ వాహనం మొరాయించింది. హైదరాబాద్ లో కోర్టుకు జగన్ హాజరై శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లే సమయంలో కూడా ఆ వాహనం ఇటీవల మొరాయించినట్టు తెలుస్తోంది.