THOOTUKUDI: తూత్తుకుడిలో కొనసాగుతున్న ఉద్రిక్తత... ఇంటింటిని జల్లెడ పడుతున్న పోలీసులు
- యువకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
- కాల్పులకు ఆదేశాలు ఇచ్చింది డీజీపీయేనని సమాచారం
- స్టెరిలైట్ పరిశ్రమకు విద్యుత్ ప్రసారం బంద్
- నిలిచిన ఇంటర్నెట్ సేవలు
స్టెరిలైట్ కాపర్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళన, పోలీసుల కాల్పులతో అట్టుడికిపోయిన తమిళనాడులోని తూత్తుకుడి ఇంకా తేరుకోలేదు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వారిని అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు కాల్పులు జరపడం, 13 మంది వరకూ మరణించడం తెలిసిందే. అయితే ప్రజలపై కాల్పులు జరిపేందుకు ఆదేశాలు ఇచ్చింది తమిళనాడు డీజీపీ రాజేంద్రన్ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్తగా తూత్తుకుడి జిల్లా కలెక్టర్ బాధ్యతల్లోకి వచ్చిన సందీప్ నండూరి మాట్లాడుతూ... తన మొదటి ప్రాధాన్యం సాధారణ పరిస్థితులు నెలకొల్పడమేనన్నారు. కాల్పులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరన్నది తమిళనాడు ప్రభుత్వం నియమించిన జడ్జి విచారణలో తేలుతుందని చెప్పారు.
మరోవైపు తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ కు విద్యుత్తును నిలిపివేయాలని ఈ రోజు ఆదేశించింది. ఇక ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోగా బుధవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చింది. పోలీసులు తూత్తుకుడిలో ఈ రోజు ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. యువకులను పట్టుకుని తీసుకెళుతున్నట్టు సమాచారం.