Vizag: అండం తీసుకుంటామని చెప్పి పిండం పెట్టారు.. విశాఖ పద్మశ్రీ హాస్పిటల్ మోసం తీరు!
- విశాఖపట్నంలో సరోగసీ బాగోతం
- యువతికి తెలియకుండా గర్భం
- రంగంలోకి దిగిన మహిళా సంఘాలు
ఓ యువతి నుంచి పిల్లల్లేని తల్లిదండ్రుల కోసం అండం సేకరిస్తామని చెప్పిన విశాఖలోని పద్మశ్రీ హాస్పిటల్ యాజమాన్యం, ఆమెకు తెలియకుండా కడుపులో పిండాన్ని ప్రవేశపెట్టిన ఘటన విశాఖలో కలకలం రేపుతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన ఆదినారాయణ దంపతులు విశాఖకు వలస వచ్చి ఉంటుండగా, భార్యతో గొడవపడిన ఆదినారాయణ భార్యను వదిలేసి వెళ్లిపోయాడు.
డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న బాధితురాలిని పక్కింట్లోనే ఉంటున్న ఉషా అనే మహిళ పరిచయం చేసుకుంది. అండాన్ని ఇస్తే రూ. 20 వేల డబ్బు ఇస్తారని నమ్మబలికింది. బాధితురాలు అంగీకరించగా, ఆమెను, పద్మశ్రీ హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ఆస్పత్రిలోనే 15 రోజులపాటు వుంచి, పలు రక్త పరీక్షలు చేసి, కాగితాలపై సంతకాలు చేయించుకున్న యాజమాన్యం, ఓ రోజు మత్తు మందిచ్చి, ఆపై 9 నెలల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని, తరువాత రూ. 3 లక్షలు ఇస్తామని నమ్మబలికారు.
సెల్ ఫోన్ కూడా లాక్కోవడం, బయటకు వెళ్లే దారిలేకుండా బంధించడంతో, ఆమె ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది. కడుపులో నొప్పిగా ఉండటంతో రాజాంకు వెళ్లి అసుపత్రిలో చూపించుకుంది. అక్కడ ఆమె కడుపులో పిండం ఉందని తేలడం, బాధితురాలికి ప్రాణహాని ఉందని చెప్పడంతో విశాఖ కేజీహెచ్ కి వచ్చింది. ఆపై భర్తను కలిసిన ఆమె, విషయం చెప్పి, పద్మశ్రీ హాస్పిటల్ కు వెళ్లి గర్భం తొలగించాలని కోరితే వారు అంగీకరించలేదు.
దీంతో బాధితురాలు మహిళా సంఘాలను ఆశ్రయించగా, ఈ ఉదయం నుంచి విశాఖలో ఆసుపత్రి ముందు నిరసనలు కొనసాగుతున్నాయి. సరోగసీ వివాదం రాద్ధాంతం రేపుతుండగా, ఫ్యామిలీ ప్లానింగ్ అయిన యువతి నుంచి అండం ఎలా తీసుకుంటారని మహిళా కమిషన్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.