social media: మీ సోషల్ మీడియా ఖాతాపై నిఘా కన్ను... దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యవేక్షకులు
- ప్రతి జిల్లాకొక హబ్ ఏర్పాటు
- సోషల్ మీడియా ఖాాతాల్లోని ప్రతి సమాచారం విశ్లేషణ
- వార్తా పత్రికలు, ఎఫ్ఎం స్టేషన్లపైనా నిఘా
నరేంద్ర మోదీ సర్కారు ఎన్నికలకు అప్పుడే సంసిద్ధమవుతోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పరిస్థితులు, ప్రజల ఆకాంక్షలపై అవగాహనకు వ్యూహాలను అమల్లో పెడుతోంది. ప్రధాన మంత్రి కార్యాలయం, సమాచార ప్రసార శాఖ దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో షోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్ లను ఏర్పాటు చేసి స్థానికంగా ఆన్ లైన్ కంటెంట్ ను విశ్లేషించే బాధ్యతలను అప్పగించనుంది. ఈ కేంద్రాల్లో పనిచేసేందుకు ఎగ్జిక్యూటివ్ లను నియమించనుంది.
ఒక్కసారి ఈ కేంద్రాలను తగిన వసతులతో ఏర్పాటు చేస్తే దాదాపు అన్ని భారతీయ భాషల్లోని కంటెంట్ ను, విదేశీ భాషల్లో ఉన్న ఆన్ లైన్ సమాచారాన్ని విశ్లేషించే అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ ప్రభావితం చేసే సోషల్ మీడియా ఖాతాలు, అధిక ఫాలోవర్లు ఉన్న ఖాతాలను సైతం గుర్తించి కేంద్రానికి సమాచారం నివేదిస్తాయి. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఇంజనీరింగ్ విభాగం బీఈసీఐఎల్ ఆధ్వర్యంలో హబ్ లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలు ఆన్ లైన్ లో సోషల్ మీడియా ఖాతాల సమాచారంతోపాటు వార్తా పత్రికలు, ఎఫ్ఎం స్టేషన్లు, కేబుల్ చానళ్లలోని సమాచారాన్ని పరిశీలిస్తుంటాయి.