Telangana: పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు ఏర్పాట్లు
- వివిధ శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎస్ భేటీ
- వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు
- అలైటింగ్, పికప్ పాయింట్ల ఏర్పాటు
- తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలు
వచ్చేనెల 2న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్యకార్యదర్శులు అధర్ సిన్హా, రాజీవ్ త్రివేది, సునీల్ శర్మ, శివశంకర్, జయేష్ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌కే జోషి మాట్లాడుతూ... రాష్ట్రావతరణ దినోత్సవం అయిన జూన్ 2 న ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి, అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారని, ఆ తరువాత ప్రసంగిస్తారని తెలిపారు. సాంస్కృతిక శాఖ ద్వారా వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిన వారికి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రెగ్యులేషన్ కు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలని, వేడుకలు ముగిశాక వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లే విషయం ఆలోచించాలన్నారు. అలైటింగ్, పికప్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమాచార శాఖ ద్వారా వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు, ఎల్ఈడీ టీవీ, పీఏ సిస్టం, కామెంటేటర్లు, మీడియా కవరేజి తదితర పనులు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు.
రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నగరంలో ప్రధాన ప్రాంతాలైన రాజ్ భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, చార్మినార్ తదితర ప్రాంతాలలో విద్యుత్ దీపాలతో అలంకరణ చేపట్టాలన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో పరిశుభ్రత, మొబైల్ టాయిలేట్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా, అంబులెన్సులు, వైద్యనిపుణుల టీమ్‌లు, బారికేడింగ్, అగ్నిమాపక యంత్రాల ఏర్పాట్లు, పుష్పాలంకరణ పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు.
రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో, పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలతో పాటు తెలంగాణ వంటకాలతో పీపుల్స్ ప్లాజా లో ఫుడ్ ఫెస్ట్ వల్ ను ఏర్పాటు చేయనున్నట్లు టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బీ వెంకటేశం వివరించారు.