Srikakulam District: ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం... దౌర్భాగ్యమే!: చంద్రబాబు టార్గెట్ గా స్వరం పెంచిన పవన్ కల్యాణ్
- ప్రజా సమస్యలపై పట్టదా?
- లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు?
- ఇంగితజ్ఞానం లేకుండా పాలన
- ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డ పవన్
తాను ప్రజా సమస్యలను ఎంతగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నా, వాటిని తీర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతమాత్రం చొరవ చూపడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పర్యటిస్తున్న ఆయన, కిడ్నీ బాధితులతో ప్రత్యేకంగా సమావేశమై, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టే ప్రభుత్వం, పేదల కన్నీళ్లను తుడవలేకపోతోందని పవన్ ఆరోపించారు.
ప్రజల కన్నీళ్లు తుడవలేని అధికారం మీకెందుకని ఆయన ప్రశ్నించారు. డైరెక్టుగా చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై తాను ఎంతో కాలంగా పోరాడుతున్నానని, ఈ విషయంలో చంద్రబాబును స్వయంగా కలిసినా, ఇక్కడి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఉన్నా లేనట్టేనని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఒక్కటి కూడా ప్రజలకు సక్రమంగా అందడం లేదని, అరకొరగా డయాలసిస్ కేంద్రాలను పెట్టి చేతులు దులిపేసుకున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అసలు డయాలసిస్ వరకూ రోగులను రానివ్వడం ఏంటని, ముందే మందులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమంది బాధల్లో ఉంటే పాలకులకు తిండెలా దిగుతుందని అన్నారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పాలకులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ఇది ప్రజల దౌర్భాగ్యమేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.