Ahsan Iqbal: మిస్సైళ్లు, యుద్ధ ట్యాంకులు మనల్ని కాపాడలేవు: పాకిస్థాన్ మంత్రి ఇక్బాల్

  • బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగాలి
  • రాజకీయ స్థిరత్వం లేకపోవడం మన వెనుకబాటుకు కారణం
  • ఒకప్పుడు చైనా తలసరి ఆదాయం మనకన్నా తక్కువగా ఉండేది
  • విదేశీ మారకద్రవ్య నిల్వలు మనకన్నా బంగ్లాదేశ్ వద్దే ఎక్కువగా ఉన్నాయి

కేవలం మిస్సైళ్లు, యుద్ధ ట్యాంకులతో మన దేశాన్ని కాపాడుకోలేమని... బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగితేనే మనల్ని మనం కాపాడుకోగలమని పాకిస్థాన్ అంతర్గతశాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ అన్నారు. గతంలో రాజకీయ స్థిరత్వం లేకపోవడంతో ఆర్థిక వృద్ధిని సాధించలేకపోయామని చెప్పారు. 1990లలో పాక్ ఆర్థికవేత్త సర్తాజ్ అజీజ్ నుంచి తీసుకున్న సలహాలను అప్పటి భారత ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ విజయవంతంగా అమలు చేసి, అద్భుతమైన ఫలితాలను సాధించారని చెప్పారు.

బంగ్లాదేశ్ కూడా ఆ వ్యూహాలను పక్కాగా అమలు చేసిందని... కానీ, సొంత ప్రణాళికలను అమలు చేయడంలో పాకిస్థాన్ మాత్రం విఫలమయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతా పాక్ లోని రాజకీయ అస్థిరతే కారణమని చెప్పారు. పాకిస్థాన్ నేషనల్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్థికంగా ఎదిగే అవకాశం పాకిస్థాన్ కు 1960లలోనే వచ్చిందని, 1990లలో రెండోసారి వచ్చిందని, మూడో అవకాశం ఇప్పుడు తలుపు తడుతోందని... ఈ అవకాశాన్ని గతంలో మాదిరి వదులుకోరాదని ఇక్బాల్ అన్నారు. ఏ దేశమైనా ఆర్థికంగా ఎదగాలంటే... శాంతి, సుస్థిరత, కొనసాగింపు అనేవి ప్రధానమైన అంశాలని చెప్పారు. ఒకప్పుడు మనకంటే వెనుకబడి ఉన్న దేశాలు ఇప్పుడు మనకంటే మెరుగైన స్థానంలో ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం ఆలోచించాలని తెలిపారు.

ఒకప్పటి చైనా తలసరి ఆదాయం పాకిస్థాన్ కంటే చాలా తక్కువగా ఉండేదని... ఇప్పుడు ఆ దేశం ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిందని చెప్పారు. బంగ్లాదేశ్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 33 బిలియన్ డాలర్లకు పెరిగితే, పాకిస్థాన్ లో విదేశీ మారకద్రవ్య నిల్వలు కేవలం 18 మిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఎదిగేందుకు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేస్తే... భవిష్యత్ తరాలు మనల్ని క్షమించబోవని హెచ్చరించారు. 

Ahsan Iqbal
Pakistan
interior minister
economy
missiles
  • Loading...

More Telugu News