dk sivakumar: అధిష్ఠానం కోసం చేదును మింగాల్సి వస్తోంది: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్

  • హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తా
  • రాజకీయాలలో ఎన్నో ఎత్తులను చిత్తు చేశా
  • సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఉంటుందో, లేదో చెప్పలేను

1985 నుంచి దేవెగౌడ కుటుంబంపై ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో దేవెగౌడపై పోటీ చేసి ఓడిపోయానని... అయితే, ఆయన కుమారుడు, కోడలుపై పోటీ చేసి గెలిచానని చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుగడలను చిత్తు చేశానని అన్నారు. కేవలం పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే జేడీఎస్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నడ ప్రజల సంక్షేమం కోసం, లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతోనే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చామని చెప్పారు.

అధిష్ఠానం కోసం చేదును మింగాల్సి వస్తోందని... అయినా వ్యక్తిగత అభిప్రాయాలకన్నా, సమష్టి నిర్ణయానికే ఎక్కువ విలువ ఉంటుందని శివకుమార్ అన్నారు. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవించడం తన కర్తవ్యమని చెప్పారు. అయితే, ఐదేళ్లపాటు కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందా? లేదా? అనే ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని అన్నారు. జేడీఎస్ తో కూటమి 2019 లోక్ సభ ఎన్నికల్లో సానుకూలంగానే ఉంటుందని చెప్పారు.  

  • Loading...

More Telugu News