Chirala: మిస్డ్ కాల్ ఇస్తుంది... వలేసి పిలుస్తుంది: చీరాలలో సంచలనం సృష్టిస్తున్న స్రవంతి వ్యవహారం
- ఇద్దరు యువకులతో కలసి ముఠా
- ఇంటికి పిలిచి తలుపేసి, ఆపై నాటకం
- పోలీసులమంటూ వచ్చి హడావుడి
- యువకుడి ఫిర్యాదుతో అరెస్ట్
ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు ఛేదించిన ఓ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు యువకులతో కలసి ముఠాగా ఏర్పడిన ఓ యువతి డబ్బున్న కుటుంబాల పిల్లలను టార్గెట్ చేస్తూ డబ్బులు దోచేస్తోంది. తొలుత మిస్డ్ కాల్ ఇచ్చి, ఆపై వారిని మెసేజ్ లు, ఫోన్ కాల్స్ వరకూ తీసుకెళ్లి, భారీ స్థాయిలో డబ్బు డిమాండ్ చేస్తోంది. మరిన్ని వివరాలకు వెళితే, చీరాల పరిధిలోని పేరాలకు చెందిన కంపా స్రవంతి ప్రియ, కుంభా ప్రకాష్, కావటి కిరణ్ లు ఓ ముఠాగా ఏర్పడ్డారు.
వీరి టార్గెట్ వ్యాపారం లేదా ఇతర రంగాల్లో బాగా డబ్బు సంపాదించిన వారి పిల్లలే. వారి ఫోన్ నంబర్లను సేకరించే ఈ ముఠా, వారికి మిస్డ్ కాల్ ఇస్తుంది. ఎవరో చేశారని తిరిగి ఫోన్ చేస్తే, అప్పుడు స్రవంతి రంగంలోకి దిగుతుంది. వారిని మెల్లిగా మాటల్లోకి దింపి వల్లో వేసుకుంటుంది. ఇక ఎవరైనా ఆకర్షితులైతే, తన ఇంటికి పిలుస్తుంది. తలుపేసేస్తుంది. ఆ సమయంలో తలుపుకొట్టి లోనికి వచ్చే ప్రకాష్, కిరణ్ లు తాము పోలీసులమని హడావుడి చేస్తూ బెదిరింపులకు దిగుతారు. బిత్తరపోయిన యువకుడిపై కేకలేస్తూ, వారిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టేస్తారు. ఏమీ లేకుంటే తలుపెందుకు వేసుకున్నారని నిలదీస్తారు. కేసు, విచారణ, అరెస్ట్ అంటూ హడావుడి చేస్తారు.
ఇక కంగారులో కాళ్ల బేరానికి వచ్చిన యువకుడి నుంచి డబ్బు డిమాండ్ చేస్తారు. డబ్బు లేకుంటే ఏటీఎం కార్డు, పిన్ నంబర్ తీసుకుని ఖాతాను ఖాళీ చేస్తారు. గుంటూరుకు చెందిన ఇస్మాయిల్ అనే యువకుడు రెండు రోజుల క్రితం స్రవంతి ఇంట్లో ఇదే విధంగా బుక్ అయి, రూ. 13 వేలు సమర్పించుకున్నాడు. ఆపై కూడా స్రవంతి ఫోన్ చేసి, రూ. లక్ష ఇవ్వాలని, లేదా పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో ఇస్మాయిల్ చీరాల పోలీసులను ఆశ్రయించగా, వారు నకిలీ పోలీసులను, స్రవంతిని కటకటాల వెనక్కు నెట్టారు. స్రవంతి బాధితులు ఇంకా చాలామందే ఉన్నారని పోలీసు వర్గాలు అంటున్నాయి.