TTD: తప్పుల మీద తప్పులు చేసిన రమణ దీక్షితులు: మీడియా సమావేశంలో టీటీడీ ఈవో

  • రమణ దీక్షితులు చేసిన విమర్శలు అవాస్తవాలు
  • పూజలు, కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి
  • తాజా ఆరోపణలపై రమణ దీక్షితులుకు నోటీసులు
  • మీడియా సమావేశంలో అనిల్ కుమార్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చేసిన విమర్శలన్నీ అవాస్తవాలేనని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు, పూజలన్నీ శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని చెప్పారు. గతంలో తప్పులు చేసిన రమణ దీక్షితులు, తాజాగా లేనిపోని ఆరోపణలు చేసి మరిన్ని తప్పులు చేస్తున్నారని, అందుకాయన వివరణ ఇచ్చుకోవాల్సిందేనని అన్నారు. ఈ మేరకు నోటీసులు పంపనున్నట్టు తెలిపారు. శ్రీవారి నగలపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు నిరాధారమని, నగలన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పారు. ఏటా స్వామివారి నగలను కొన్ని రోజుల పాటు భక్తులకు చూపించేందుకు తాము సిద్ధమేనని అన్నారు.

2012లోనే అర్చకుల పదవీ విరమణ వయోపరిమితిని 65 ఏళ్లుగా నిర్ణయించినట్టు గుర్తు చేసిన ఆయన, అప్పట్లో ముగ్గురు అర్చకులు రిటైర్ అయ్యారని తెలిపారు. ఆ సమయంలో వారు కోర్టుకు వెళ్లగా, కోర్టు వారి పిటిషన్ ను తిరస్కరించి, జీతభత్యాలు లేని అర్చకులుగా కొనసాగవచ్చని సూచించిందని చెప్పారు.

ప్రస్తుతమున్న అర్చకుల సర్వీస్ ప్రకారం సీనియర్‌ ను ప్రధాన అర్చకులుగా నియమించామని అన్నారు. భక్తులకు నిజానిజాలు తెలిపేందుకు మాత్రమే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశానని అన్నారు. మిరాశీ వంశీకులకు, బ్రాహ్మలకు ఎటువంటి అన్యాయమూ జరగబోదని హామీ ఇచ్చారు. స్వామి సేవల నిమిత్తం ఒక్కో కుటుంబంలో ఒకరికి చొప్పున నలుగురికి ప్రధాన అర్చక పదవులను ఇచ్చామని తెలిపారు.

TTD
Tirumala
Tirupati
Ramana Deekshitulu
Anil Kumar Singhal
  • Loading...

More Telugu News