Rahul Gandhi: ఆద్యంతం ఆయనే... తొలిసారి అమిత్ - మోదీ ద్వయంపై రాహుల్ గాంధీ పైచేయి!

  • తొలిసారి బయటకు వచ్చిన రాహుల్ నాయకత్వ పటిమ!
  • ఫలితాలు వెల్లడైన తరుణంలోనే ప్లాన్ బీ అమలు
  • బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమికి కర్ణాటక నుంచి బీజం

కర్ణాటకలో గడచిన నాలుగు రోజులుగా జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలోని నాయకత్వ పటిమను తొలిసారిగా తెరపైకి తెచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితాలు వెల్లడైన క్షణం నుంచి, బీజేపీని గద్దె దించేంత వరకూ అన్నీ తానై చూసుకుని రాష్ట్రంలోని పార్టీ నేతలకు సూచనలు ఇస్తూ, తాననుకున్న ప్రణాళిక ప్రకారం రాహుల్ వ్యవహరించారని తెలుస్తోంది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వంలో జాతీయ కూటమికి సైతం కర్ణాటక నుంచి నాంది పడినట్టే.

12వ తేదీన ఫలితాల సరళి తెలియగానే, హంగ్ తప్పదన్న అంచనాకు వచ్చిన కాంగ్రెస్ నేత, వెంటనే ప్లాన్ బీని సిద్ధం చేశారు. కుమారస్వామిని సీఎం చేయడం ద్వారా, బీజేపీని అధికారానికి దూరం చేయవచ్చన్న ఆలోచనతో సీనియర్ నేతలు గులాం నబీ, ఆశోక్ గెహ్లాట్ లను ఆయన బెంగళూరుకు పంపారు. ఆపై సోనియాగాంధీతో దేవెగౌడకు ఫోన్ చేయించిన రాహుల్ గాంధీ, కుమారస్వామికి పదవి ఇచ్చే విషయమై సిద్ధరామయ్యను ఒప్పించారు. గవర్నర్ బీజేపీకి సాయం చేస్తారని కూడా రాహుల్ ముందే ఊహించారు.

ఎంతో అనుభవమున్న న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలను రంగంలోకి దింపి, అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపులు తట్టడం వెనుక కూడా రాహుల్ వేసిన ప్లాన్ ఉంది. ఆపై బల నిరూపణకు సాధ్యమైనంత తక్కువ సమయం లభించేలా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వెలువడటంతోనే బీజేపీ ఓటమి ఖరారైంది. అంతకుముందే క్యాంపులకు ఎమ్మెల్యేలను తరలించాలని, ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో వాయిస్ రికార్డు ఉండాలని కూడా ఆయనే సూచించినట్టు తెలుస్తోంది. ఈ విధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలపై రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి పైచేయిని సాధించారనే చెప్పాలి.

  • Loading...

More Telugu News